- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జిల్లాలో గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ అభిలాష
జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంగళవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ ప్రతినిధి, నిర్మల్ : జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించేందుకు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి మంగళవారం సారంగాపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ సిలిండర్ గోదాంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సరఫరాలో జరుగుతున్న జాప్యం, గోదాం నిర్వహణలో భద్రతా ప్రమాణాల లోపాలపై ఆమె ఏజెన్సీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వినియోగదారులతో కలెక్టర్ మాట్లాడుతూ సిలిండర్ బుకింగ్ చేసిన తర్వాత వినియోగదారులు ఏజెన్సీల వద్దకు రావాల్సిన అవసరం లేదని, నిర్ణిత గడువులోగా సిలిండర్లు గ్రామాలకు డోర్ డెలివరీ చేయాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. సిలిండర్ల సరఫరాలో జాప్యం జరిగితే లేదా వినియోగదారులకు ఇబ్బందులు కలిగితే సంబంధిత ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దని, అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని, యథావిధిగా సరఫరా జరుగుతుందని చెప్పారు. గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టించడం, కృత్రిమ కొరత సృష్టించడం లేదా బ్లాక్‌లో విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం గోదాం లోపల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్న ప్రదేశంలో అవసరమైన అగ్నిమాపక యంత్రం ఉండాలని ఆదేశించారు. భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. తక్షణమే తహశీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు జిల్లాలోని గ్యాస్ గోదాములను తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలపై సమగ్ర చెక్ లిస్ట్ రూపొందించాలని ఆదేశించారు. ఫైర్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చట్టప్రకారం.. భారీ జరిమానాలు విధించాలని సూచించారు. గ్యాస్ గోదాముల నిర్వహణ, భద్రతా చర్యల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని హెచ్చరించారు.
అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు
అక్రమ మొరం తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిలాష అభినవ్ హెచ్చరించారు. మంగళవారం సారంగాపూర్ మండలంలోని జాం గ్రామ చెరువు సమీపంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అవసరాల కోసం మొరం తవ్వకాలు చేపట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా రెవెన్యూ అధికారుల అనుమతి పొందిన తర్వాత మాత్రమే తవ్వకాలు చేయాలని సూచించారు. అక్రమ మొరం తవ్వకాలపై రెవెన్యూ అధికారులు పటిష్ట నిఘా ఉంచాలని ఆదేశించారు. మొరం, ఇసుక అక్రమ తవ్వకాలు చేసే వారిపై అలాగే అక్రమంగా రవాణా చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, మైనింగ్ అధికారి హరి ప్రసాద్, తహసిల్దార్ సంధ్యారాణి, రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచ్ పాల్గొన్నారు.






