దొంగతనం ముఠా గుట్టురట్టు..

by Kodari Anjali |

ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

దొంగతనం ముఠా గుట్టురట్టు..
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు, ఓ స్క్రాప్ వ్యాపారి పరారీలో ఉన్నట్లు టూ టౌన్ సీఐ కె. నాగరాజు తెలిపారు. అరెస్టైన నిందితులు మీర్జా ముషరఫ్ బేగ్ అలియాస్ చోటా ముషరఫ్, మహమ్మద్ అర్షద్ అలియాస్ బబీ, మహమ్మద్ అబ్దుల్ వసీం కాగా, కానాందే అనిల్, విష్ణు, స్క్రాప్ వ్యాపారి ఇమ్రానొద్దీన్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు మద్యం, మత్తు పదార్థాలకు బానిసై విలాసాలకు డబ్బు అవసరమై దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు. ఈ నెల 9న తాంసి బస్టాండ్ సమీపంలోని కేకే కాటన్ కమిషన్ ఏజెన్సీ దుకాణంలో వెనుక తలుపు పగులగొట్టి రూ.18,670 నగదు, జాగ్వార్ కంపెనీ ఇత్తడి ట్యాపులను చోరీ చేసి స్క్రాప్ షాపులో విక్రయించినట్లు తెలిపారు. అలాగే జూలై 11న ఆదిలాబాద్ రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉన్న రైలుకు చెందిన డీజిల్ ట్యాంక్ ఇత్తడి మూతను కూడా చోరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సుజుకి బర్గ్‌మన్ స్కూటీ, రెండు మొబైల్ ఫోన్లు, రూ.2,900 నగదు, సుమారు రూ.15 వేల విలువైన జాగ్వార్ వాల్ మిక్సర్, రైల్వే డీజిల్ ట్యాంక్ ఇత్తడి మూత, మెఫెంటర్మైన్ ఇంజెక్షన్, నాలుగు సిరంజీలు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Next Story