క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ వశం..

by Kodari Anjali |

రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు శనివారం ముగిసింది.

క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ వశం..
X

దిశ, రామకృష్ణాపూర్: రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు శనివారం ముగిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన ఈ ఎన్నికలో బీఆర్ఎస్, సిపిఐ కూటమి విజయకేతనం ఎగురవేసింది. మున్సిపల్ చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీకి చెందిన గోడిసెల సంధ్యారాణి, వైస్ చైర్మన్‌గా సిపిఐ పార్టీకి చెందిన మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. గత ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార సమయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది. బిఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో, హైకోర్టు ఆదేశాల మేరకు పటిష్ట బందోబస్తు మధ్య శనివారం ఎన్నిక నిర్వహించారు.

పంతం నెగ్గించుకున్న బాల్క సుమన్..

మున్సిపాలిటీలో మొత్తం 22 మంది కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ , సిపిఐ కూటమికి 14 మంది బలం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు, ఒక స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. సంఖ్యాబలం తమకే ఉన్నా అధికార పార్టీ అక్రమ కేసులు పెడుతుందని బాల్క సుమన్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన కౌన్సిలర్లను సుమారు 50 రోజుల పాటు క్యాంపులో ఉంచారు. మంత్రి వివేక్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎవరు కూడా హాజరు కాకపోవడంతో క్యాతనపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగుండం కమిషనరేట్ పరిధిలోని పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. ప్రజాస్వామ్యం గెలిచిందని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు తమ వైపే ఉన్నారని ఎన్నికైన చైర్మన్ గోడిసెల సంధ్యారాణి పేర్కొన్నారు.

Next Story