- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
' సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే గ్రామ సభల ఉద్దేశం '
గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు అన్నారు.

దిశ, ఉట్నూర్ : గ్రామాల్లోని సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే గ్రామ సభల ముఖ్య ఉద్దేశమని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు అన్నారు. గురువారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రజాపాలన - ప్రగతి నివేదికలో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ గ్రామ సభను స్థానిక రైతు వేదికలో సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని ఎంపీడీవో రామ్ ప్రసాద్ చదివి వినిపించారు. గ్రామ పంచాయతీ నివేదికను కార్యదర్శి శంకర్ సభలో వివరించారు.
పలువురు సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియను రాజకీయాలకు అతీతంగా, పారదర్శకంగా గెజిటెడ్ అధికారుల సమక్షంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు అందేలా నాలుగు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి కోసం కొత్త బోరుబావుల మంజూరు వంటి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వినియోగంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అధికారులు ఎప్పుడూ ఫోన్లకు అందుబాటులో ఉండి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అధికారుల సమన్వయంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ గ్యారంటీ పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. అన్ని హాస్టళ్లు, పాఠశాలల్లో డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంచడం ద్వారా పేద విద్యార్థులకు మెరుగైన ఆహారం, వసతులు కల్పిస్తున్నామని వివరించారు. ఉట్నూర్ గ్రామ పంచాయతీలో మొదటి విడతగా సుమారు 66 ఇళ్లకు గాను రూ. 90 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా 16,000 ఇళ్లకు గాను సుమారు రూ. 220 కోట్లు మంజూరయ్యాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఐదేళ్లలో ఇళ్లు అందుతాయని అన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కొత్తగా రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని, అలాగే ఉట్నూరులో ఐటీఐలో టాటా సంస్థ సహకారంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభమైందని చెప్పారు. దీని ద్వారా 200 మంది యువతకు రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి ఆధునిక అంశాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మహిళా సాధికారత కోసం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, స్కూల్ యూనిఫాం కుట్టే పనులు, ఆర్టీసీ డ్రైవింగ్ శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని అన్నారు. గ్రామాల్లో తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. అనంతరం ఉట్నూర్ రైతు వేదిక సమీపంలోని వెదురు తయారీదారుల ఇళ్లను సందర్శించి, వారి జీవనోపాధి గురించి అడిగి తెలుసుకున్నారు. మురికి కాలువ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి మనోహర్, ఎంపీడీవో రామ్ ప్రసాద్, రైతులు, మహిళా సంఘాలు, గ్రామస్తులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






