ముళ్ల పోదల్లో పేదల భూమి..!

by Ratna Kumari |

దాదాపు 33 సంవ‌త్స‌రాల క్రితం పేద‌ల‌కు ఇస్తామ‌ని ప్ర‌భుత్వం కొనుగోలు చేసిన భూమిని పేద‌ల‌కు ఇవ్వాల‌ని ఆ గ్రామ‌స్తులు కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఆ భూమి ముళ్ల పొద‌ల‌తో నిండిపోయి ఉంది.

ముళ్ల పోదల్లో పేదల భూమి..!
X

దిశ‌, కుబీర్ : ప్రభుత్వానికి ఇంటి స్థలం ఇవ్వడం భారంగా మారడంతో సొంత ఇంటి స్థలం ఉన్న నిరుపేదలకు రూ.5ల‌క్ష‌లు ఇందిరమ్మ పథకం కింద‌ అందించి ప్రోత్సహిస్తోంది. ఉన్న స్థలాల్ని నిరుపేదలకు చూపించక దశాబ్దాల కాలంగా కాలయాపన చేస్తున్న వైనం ఇది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బాకోట గ్రామశివారులో 1993లో అప్పటి ప్రభుత్వం 10ఎకరాల 10గుంటల భూమిని సౌనా, బాకోట గ్రామాల ముంపు బాధితులకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు కొనుగోలు చేసింది. 33ఏళ్ళు కావస్తున్నా.. ఇరు గ్రామాల లబ్దిదారులకు పక్కాగా ఇళ్ల స్థలాలు చూపించకపోవడంతో పేదలు నిరాశ పడుతున్నారు. దశాబ్దాలుగా ముళ్లపొదళ్లోనే పేదల భూమి ఉండడంతో ప్రభుత్వాల ఆశయాలు నీరు గారుతున్నాయని పలువురు వాపోతున్నారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సొంత‌ ఇంటి క‌ల నెరవేరడం లేదనే విమర్శలున్నాయి. ఎల్ల కాలంగా ఎవరు పట్టించుకోకపోవడంతో భూమి కబ్జాక గురయ్యే అవకాశాలు ఉన్నాయని పలువులు అంటున్నారు. బాకోట గ్రామానికి స్మశాన వాటిక స్థలం లేదు. గత జూలైలో గ్రామవ్యక్తి మరణించడంతో ఈ స్థలంలో కర్మకాండలకు ఏర్పాట్లు చేస్తుండగా ప్లాట్ల కేటాయింపులో ఈ స్థలం ఎవరికి వస్తుందోనని కొందరు అడ్డుకున్నారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులు బంధువులు ధర్నాకు దిగారు. గతంలో మృతి చెందిన మా కుటుంబ సభ్యున్ని కూడా ఇక్కడే కర్మకాండ చేశాం అంటూ వాపోయారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో సమస్య సద్దుమణిగింది. పేదలకు ఇంటి నిర్మాణాల కోసం కేటాయించిన భూమిని దశాబ్దాలకాలంగా అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నామని నిరుపేదలు వాపోతున్నారు. జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి ఇరు గ్రామాల లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను చూపించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

Next Story