బీఆర్ఎస్ కౌన్సిలర్ అపహరణ.. ఖానాపూర్ లో పొలిటికల్ హీట్

by Batti.Sumithra |

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఈ నెల 4న జరగనున్న నేపథ్యంలో ఖానాపూర్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

బీఆర్ఎస్ కౌన్సిలర్ అపహరణ.. ఖానాపూర్ లో పొలిటికల్ హీట్
X

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పురపాలక సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఈ నెల 4న జరగనున్న నేపథ్యంలో ఖానాపూర్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్ మేసు పోసమ్మ, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీకి చెందిన ఇతర కౌన్సిలర్లతో కలిసి క్యాంపులో ఉన్న సమయంలో కొంతమంది దుండగులు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటన పై గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖానాపూర్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ అజయ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనతో ఖానాపూర్ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రజల తీర్పును గౌరవించకుండా ప్రజా ప్రతినిధులను అపహరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని తీవ్రంగా ఖండించారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధిని కిడ్నాప్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. తక్షణమే మేసు పోసమ్మను సురక్షితంగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ నెల 4న జరగనున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల రోజున ఖానాపూర్ పట్టణాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు రాథోడ్ రాం నాయక్, గౌరీకారి రాజు, సక్కారం శ్రీనివాస్, శనిగరపు శ్రవణ్, కారింగుల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story