అక్ర‌మ స్క్రాప్ మాఫియా కి అధికారుల అండ

by Nallavelli.Anjaneyulu |

మున్సిపల్ అధికారుల తీరు చూస్తుంటే సామాన్యుడికి ఒక నీతి, స్క్రాప్ మాఫియాకు మరో నీతి అన్నట్టుగా ఉంది. కాగజ్ నగర్ పట్టణంలో జనవాసాల మధ్య నిబంధనలను తుంగలో తొక్కి వెలిసిన అక్రమ స్క్రాప్ యార్డులు విద్యార్థుల వసతి గృహాల మధ్య ఉంటే.. అధికారులు మాత్రం మాకేం తెలియనట్టు నటన ప్రదర్శిస్తున్నారు.

అక్ర‌మ స్క్రాప్ మాఫియా కి  అధికారుల అండ
X

దిశ, కాగజ్‌నగర్ : మున్సిపల్ అధికారుల తీరు చూస్తుంటే సామాన్యుడికి ఒక నీతి, స్క్రాప్ మాఫియాకు మరో నీతి అన్నట్టుగా ఉంది. కాగజ్ నగర్ పట్టణంలో జనవాసాల మధ్య నిబంధనలను తుంగలో తొక్కి వెలిసిన అక్రమ స్క్రాప్ యార్డులు విద్యార్థుల వసతి గృహాల మధ్య ఉంటే.. అధికారులు మాత్రం మాకేం తెలియనట్టు నటన ప్రదర్శిస్తున్నారు. రెండు విద్యార్థుల హాస్టళ్ల మధ్య విషపూరితమైన స్క్రాప్ యార్డు నడుస్తుంటే, అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇంతకుముందు గత ఏడాది డిసెంబర్ 23 2025 రోజు దీనిపై కథనం రాయడంతో నామమాత్రం నోటీసులు ఇచ్చారు. మళ్ళీ మౌనంగా ఉంటారు. ఈ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి. కనీస అనుమతులు లేవు, ఫైర్ సేఫ్టీ లేదు. రేపు పొద్దున ఏదైనా ప్రమాదం జరిగి విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లితే, అప్పుడు మీ నోటీసుల కాగితాలు వారిని కాపాడతాయా మున్సిపల్ అధికారుల చేతకానితనం వల్లే అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రోడ్లను ఆక్రమించి, పాత వాహనాలను దొంగలించిన వాటిని తుక్కుగా మార్చి, గాలిని విషం లాగా చేస్తుంటే అధికారులు మాత్రం కేవలం కాగితాల గుర్రాలను పరిగెత్తిస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దొంగలించిన వాహనాలకు అడ్డాగా స్క్రాప్ స్క్రాప్ దుకాణాలు మారుతున్నా పోలీసులకు పట్టదు. విషవాయువులు వెలువడుతున్నా మున్సిపల్ అధికారులకు వినపడదు. ప్రజలు రోగాల బారిన పడుతున్నా పాలకులకు కనపడదు. మున్సిపల్ కమిషనర్ ఏసీ గదుల్లో ఫైళ్ల మధ్య కాదు, వీధుల్లోకి వచ్చి చూడండి. నిబంధనలను గాలికి వదిలేసిన ఆ స్క్రాప్ దుకాణాలను ఇప్పటికైనా కాలయాపన ఆపి.. అక్రమ స్క్రాప్ దుకాణాలపై ఉక్కుపాదం మోపాలని, మీ సొంత పిల్లలు ఉండే హాస్టల్ పక్కన ఇలాంటి ప్రమాదకరమైన స్క్రాప్ యార్డు ఉంటే మీరు ఇలాగే మౌనంగా ఉంటారా..? ప్రజల ప్రాణాలంటే మీకు అంత లోకువా అని ప్రజలు విమర్శిస్తున్నారు.

Next Story