- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడవే ఆధారం.. అటవీ ఉత్పత్తులే జీవనాధారం
ఆదివాసీల జిల్లా, అడవుల జిల్లా గా పేరుగాంచిన ఆదిలాబాద్‌లో గిరిజనుల జీవనం అడవులపైనే ఆధారపడి ఉంది.

దిశ, ఉట్నూర్ : ఆదివాసీల జిల్లా, అడవుల జిల్లా గా పేరుగాంచిన ఆదిలాబాద్‌లో గిరిజనుల జీవనం అడవులపైనే ఆధారపడి ఉంది. అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయించడం ద్వారా వేలాది ఆదివాసీ కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఎండాకాలం ప్రారంభమైతే చాలు.. అడవుల్లో లభించే ఇప్పపువ్వు సేకరణలో గిరిజనులు నిమగ్నమవుతారు. ఇప్పపువ్వుతో పాటు తునికిపండ్లు, మొర్రపండ్లు, ఇప్పపరక, తునికి ఆకులు, చిటమట పండ్లు, తేనే, మద్ది బంక, చింతపండు, కరక్కాయలు, కానుగ గింజలు, నల్లజీడి గింజలు వంటి అనేక అటవీ ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
పొద్దుపొడవక ముందే అడవిబాట
అడవులనే ఆయువుపట్టుగా భావించే గిరిజనులు తెల్లవారకముందే చిన్న చిన్న బుట్టలు, గంపలు చేతబట్టి అడవుల బాట పడుతున్నారు. అడవిలో లభించే ఇప్పపువ్వును సేకరించి ఎండబెట్టి విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఎండ, వానలతో సంబంధం లేకుండా అడవుల్లో తిరుగుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే రోజురోజుకు అడవులు తగ్గిపోవడం, అటవీ ఉత్పత్తులు కనుమరుగవుతుండడంతో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సేకరించిన ఉత్పత్తులకు ఆశించిన మద్దతు ధరలు లభించడం లేదని వాపోతున్నారు.
అటవీ ఉత్పత్తులే ప్రత్యామ్నాయ ఉపాధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల ప్రజలు ప్రధానంగా అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తుకినిపండ్లు, మొర్రపండ్లు, ఇప్పపరక, తునికి ఆకులు, చిటమట పండ్లు, తేనే, తప్సి బంక (జిగురు), తేనె మైనం, విషముష్టి గింజలు, నల్లజీడి గింజలు, నరమామిడి చెక్క, కానుగ గింజలు, చింతపండు, చిల్ల గింజలు, కరక్కాయలు తదితర ఉత్పత్తులను సేకరించి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు.
తగ్గిపోతున్న అటవీ ఉత్పత్తులు
అడవుల తరుగుదల కారణంగా ప్రకృతి సహజంగా లభించే అటవీ ఉత్పత్తులు క్రమంగా తగ్గిపోతున్నాయని గిరిజనులు చెబుతున్నారు. ప్రస్తుతం వేసవికాలంలో మొర్రపండ్లు, తునికిపండ్లు, ఇప్పపువ్వు అందుబాటులో ఉండడంతో వాటిని సేకరించి అమ్ముకుంటున్నారు. కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో ఉండటంతో అడవుల్లోకి వెళ్లేందుకు గిరిజనులు భయపడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇప్పపువ్వు కోసం ఎలుగుబంట్లు అడవుల్లోకి రావడంతో గతంలో ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి.
జీసీసీ ద్వారా కొనుగోళ్లు
గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తోంది. జీసీసీ పరిధిలో 110 డీఆర్డీ పో కేంద్రాల ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా కొనుగోళ్లు సరిగా జరగకపోయినా, ఈసారి పూర్తి స్థాయిలో కొనుగోళ్లు చేపట్టి రూ.2 కోట్ల విలువైన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
మద్దతు ధరలు ఇవే..
జీసీసీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న అటవీ ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి :
ఇప్పపువ్వు – రూ.30
తేనే – రూ.225
ఇప్పగింజలు – రూ.29
తప్సి బంక (జిగురు) – రూ.114
తేనె మైనం – రూ.160
మారేడు గడ్డలు – రూ.190
చింతపండు – రూ.70
ఎండు ఉసిరి – రూ.52
విషముష్టి గింజలు – రూ.70
చిల్ల గింజలు – రూ.35
నరమామిడి చెక్క – రూ.32
కరక్కాయలు – రూ.15
కుంకుడు కాయలు – రూ.45
నల్లజీడి గింజలు – రూ.12
కానుగ గింజలు – రూ.10
అయితే అటవీ ఉత్పత్తులు గతంతో పోలిస్తే ప్రస్తుతం చాలా తగ్గిపోయాయని, సేకరించిన ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలు కల్పించాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ ఉత్పత్తులు ఇచ్చే చెట్లను పెద్దఎత్తున పెంచితే గిరిజనులకు ఉపాధితో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కొనుగోళ్లు కొనసాగిస్తున్నాం – సందీప్ కుమార్, జీసీసీ డివిజనల్ మేనేజర్, ఉట్నూర్
గిరిజనులు అడవుల నుంచి సేకరిస్తున్న ఉత్పత్తులను జీసీసీ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. సేల్స్‌మెన్‌లు గూడాల వారీగా పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఇప్పపువ్వు, ఇప్పపరక, తేనే, నరమామిడి చెక్క, చింతపండు, తప్సి బంక, విషముష్టి గింజలు, నల్లజీడి గింజలు, కానుగ గింజలు, చిల్ల గింజలు, కరక్కాయలు తదితర ఉత్పత్తులను డీఆర్డీ పో కేంద్రాల్లో విక్రయించాలని గిరిజనులను కోరారు.






