పీఆర్‌సీ కోసం ఉద్యోగ సంఘాల పోరుబాట..!

by Jakkula.Mamatha |

ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది.

పీఆర్‌సీ కోసం ఉద్యోగ సంఘాల పోరుబాట..!
X

దిశ, ప్రతినిధి నిర్మల్: ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఉద్యోగ సంఘాలు ధర్నాకు దిగాయి నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జేఏసీగా ఏర్పడి సర్కారుపై పోరును ప్రకటించాయి.

కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగ జేఏసీ ధర్నా

రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రభాకర్, సెక్రటరీ జనరల్ డాక్టర్ పిజి రెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు, పిఆర్సి, ఈహెచ్ఎస్ తదితర ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా పరిశీలకులుగా విచ్చేసిన రాష్ట్ర పెన్షనర్ల ప్రధాన కార్యదర్శి ఎం సి లింగన్న మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇవ్వవలసిన రెండో పి ఆర్ సి ని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న అన్ని డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్ ను ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలని కోరారు.

అదేవిధంగా ఉద్యోగుల హెల్త్ కార్డులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. మరో పరిశీలకుడు జుట్టు గజేందర్ మాట్లాడుతూ.. సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో ఈ విషయాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీజీవో జిల్లా కార్యదర్శి ధాత్రిక రమేష్ జిల్లా టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కూడాల రవి కుమార్, ఎస్‌టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లక్ష్మణ్ , పీఆర్‌టియు అధ్యక్షుడు నరేంద్ర బాబు, జిల్లా ఏఈఓల అధ్యక్షుడు అశోక్, డిటిఎఫ్ అధ్యక్షుడు విజయ్ కుమార్, యుటిఎఫ్ అధ్యక్షుడు దాసరి శంకర్ అన్ని సంఘాల యూనియన్ బాధ్యులు, పెద్ద సంఖ్యలో గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు పెన్షనర్లు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.

Next Story