పుర 'పోరు'.. మగువల జోరు..

by I. Sairam |

పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి చైర్మన్ పదవులు కౌన్సిలర్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.

పుర పోరు.. మగువల జోరు..
X

దిశ, నిర్మల్ ప్రతినిధి: పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి చైర్మన్ పదవులు కౌన్సిలర్ల పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్ సైతం ఈ వారంలోనే వెలువడే అవకాశం ఉండడంతో... అంతకుముందే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..

పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి. కీలకమైన పురపాలక సంఘాల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపికకు పావులు కదుపుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాకు సంబంధించి 11 మున్సిపాలిటీలకు గాను ఆరు పురపాలక సంఘాలకు మహిళ చైర్ పర్సన్లు రాబోతున్నారు. నాలుగు మున్సిపాలిటీలను బీసీలకు కట్టబెట్టారు. ఒకచోట మాత్రం ఎస్సీలకు రిజర్వు చేశారు. సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో తూర్పు జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. ఖానాపూర్ బైంసా మున్సిపాలిటీలను జనరల్ కు కేటాయించారు. మరో నాలుగు జనరల్ కు కేటాయించినప్పటికీ ఆస్థానాలను మహిళలకు పరిమితం చేశారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలకు పెద్దపీట వేసినట్లు అయింది.

ఇవీ రిజర్వేషన్లు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చైర్మన్ ల రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది కీలకమైన ఆదిలాబాద్ పురపాలక సంఘం జనరల్ మహిళలకు కేటాయించారు అలాగే నిర్మల్, క్యాతన్ పల్లి, బెల్లంపల్లి పురపాలక సంఘాలు సైతం జనరల్ మహిళలకు ఖరారు చేశారు. ఖానాపూర్ బైంసా పురపాలక సంఘాలు జనరల్ స్థానాలుగా ఖరారు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆసిఫాబాద్ కాగజ్ నగర్ చెన్నూర్ బీసీలకు కేటాయించగా... ఇందులోనూ కాగజ్నగర్ , చెన్నూర్ స్థానాలను బిసి మహిళలకు ఖరారు చేశారు. ఆసిఫాబాద్ పురపాలక సంఘానికి తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్థానాన్ని బిసి జనరల్ కు కేటాయించడం గమనార్హం. కాగా మందమర్రి పురపాలక సంఘం ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నందున ఈసారి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది.

మంచిర్యాల కార్పొరేషన్ బీసీలకు..

గతంలో పురపాలక సంఘంగా ఉన్న మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలతో పాటు చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలను కలిపి కొత్తగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని బిసి జనరల్ కు కేటాయించారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ పై బాగా వేసేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు అప్పుడే కసరత్తు మొదలుపెట్టాయి.

మొదలైన అభ్యర్థుల అన్వేషణ..

మున్సిపల్ చైర్ పర్సన్లు కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇలాగైనా ఆ స్థానాలపై పట్టు సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు కసరత్తు మొదలుపెట్టాయి కౌన్సిలర్ల అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థులను ఖరారు చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీలు తలమునకలు అవుతున్నాయి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులను ఖరారు చేస్తే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్లకు తీవ్ర పోటీ కనిపిస్తున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో సాధారణ ఓటర్లు సహజంగానే అధికార పార్టీ వైపు కాస్త మొగ్గు చూపే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ టికెట్ల కోసం ఆశావాహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది.

మరోవైపు నిర్మల్ ఆదిలాబాద్ కాగజ్నగర్ పురపాలక సంఘాల్లో బిజెపి తరఫున పోటీ చేసేందుకు భారీగానే అభ్యర్థులు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇక భారత్ రాష్ట్ర సమితి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ పురపాలక సంఘంపై కన్నేసింది. మరోవైపు ఎంఐఎం పార్టీ బైంసా పురపాలక సంఘాన్ని మరోసారి చేజిక్కించుకోవాలన్న సంకల్పంతో పావులు కదుపుతున్నది. మరోవైపు నిర్మల్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలలో మెజారిటీ సీట్లను సాధించే దిశగా వ్యూహాత్మకంగా ఆ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Next Story