- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసంపూర్తి మార్కెట్లు - అలంకారప్రాయంగా ప్రాజెక్టులు
చెన్నూరు నియోజకవర్గంలో నాలుగేళ్లుగా నిలిచిన మోడల్ మార్కెట్ల పనులు.. నిధులు రాక కాంట్రాక్టర్ల బంద్.. హైవేలపైనే ప్రమాదకరంగా వ్యాపారాలు!

దిశ, మందమర్రి : చెన్నూరు నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మోడల్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ల భవన నిర్మాణాలు ఆదిలోనే ఆటంకాలతో అలంకారప్రాయంగా మారాయి. 2022 లో అప్పటి ప్రభుత్వం పబ్లిక్ హెల్త్, మున్సిపల్, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వీటిని ప్రారంభించింది. మందమర్రి మున్సిపాలిటీలో రూ.9.55కోట్లతో పనులు మొదలవగా, ఇప్పటివరకు రూ.3.45కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి. అయితే కాంట్రాక్టర్‌కు కేవలం రూ.2.72కోట్ల బిల్లులు మాత్రమే విడుదల చేయడంతో నిధులు రాక పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఫలితంగా నిర్మాణ ప్రాంగణం నిరుపయోగంగా మారి పిచ్చి మొక్కలు మొలిచి, చెత్తాచెదారంతో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు, ఈ అసంపూర్తి కట్టడాలు మాత్రం మారడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఫ్లై ఓవర్ కింద ప్రమాదకర వ్యాపారాలు..
మందమర్రిలోని జాతీయ రహదారి వెంబడి పాత బస్టాండ్ ఏరియా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఆధునిక మార్కెట్ అందుబాటులోకి రాకపోవడంతో కూరగాయలు, మాంసం వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాల రద్దీ ఉండే జాతీయ రహదారి ఫ్లై ఓవర్ (వంతెన) కిందనే ప్రమాదకరంగా కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నారు. కొనుగోలుదారులు రోడ్డు పక్కనే వాహనాలు నిలిపి సామగ్రి కొంటుండడంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మరోవైపు వర్షపు నీరు నిలిచి దోమలు పడుతున్నా మున్సిపాలిటీ వాళ్లు చెత్త తొలగించడం లేదని వ్యాపారులు మండిపడుతున్నారు. రోడ్లపై అమ్ముకునే తమ వద్ద ప్రతిరోజూ ‘థాయ్ బజార్’ కింద మున్సిపల్ సిబ్బంది పన్నులు వసూలు చేస్తున్నారే తప్పా, మార్కెట్ పనులను పూర్తి చేయడంపై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందుబాబులకు అడ్డాలుగా కట్టడాలు..
నియోజకవర్గంలోని మిగతా రెండు మున్సిపాలిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణపూర్ పట్టణం అంగడిబజార్ ఏరియాలో రూ.9.75కోట్లతో మార్కెట్ యార్డ్ పనులు ప్రారంభమవగా.. కేవలం రూ.3.52కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఇక్కడ కాంట్రాక్టర్‌కు రూ.2.71కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ అసంపూర్తి కట్టడం మందుబాబులకు స్థావరంగా మారింది. అలాగే చెన్నూరు మున్సిపాలిటీలో రూ.9.55కోట్లతో పనులు మొదలుపెట్టగా రూ.4.32కోట్ల వరకు పనులు జరిగాయి. ఇక్కడ కూడా కాంట్రాక్టర్‌కు రూ.3.01కోట్ల బకాయిలు రాకపోవడంతో పనులు ఆగిపోయాయని మున్సిపల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ డీఈఈ మధుకర్ తెలిపారు.
బిల్లులు వస్తేనే పనులు పూర్తి...
ఈ నిలిచిపోయిన ప్రాజెక్టులపై జిల్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుకర్ వివరణ ఇచ్చారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల్లో చేపట్టిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు పూర్తి కావాలంటే ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ల పాత బకాయిలు విడుదల కావాల్సి ఉందన్నారు. పెండింగ్ బిల్లులు మంజూరు కావడం ఆలస్యం కావడం వల్లే నిర్మాణ సంస్థలు పనులను నిలిపివేశాయని, నిధులు రాగానే మిగతా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి మార్కెట్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.






