- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిల్లు వీగె.. ఆశలు ఆగె..!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, మహిళలకు రిజర్వేషన్ల ఖరారు జరుగుతాయన్న ఆశతో ఎదురు చూస్తున్న నేతలకు శుక్రవారం పార్లమెంట్‌లో జరిగిన వీగిపోయిన బిల్లు వారి ఆశలపై నీళ్లు చల్లింది.

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, మహిళలకు రిజర్వేషన్ల ఖరారు జరుగుతాయన్న ఆశతో ఎదురు చూస్తున్న నేతలకు శుక్రవారం పార్లమెంట్‌లో జరిగిన వీగిపోయిన బిల్లు వారి ఆశలపై నీళ్లు చల్లింది. మోడీ ప్రభుత్వం గతంలో అనేక బిల్లులు.. అనేక అవాంతరాలు ఎదురైనప్పటికీ పార్లమెంటులో పాస్ చేయించినప్పటికీ.. మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల పై విజయం సాధించకపోవడం పట్ల భిన్న రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలపైకి నెపం నెడుతున్నప్పటికీ.. అన్ని బిల్లులను ముడేసి లోక్ సభలో ప్రవేశపెట్టిన తీరుపై రాజకీయ పక్షాలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే 10 ఉండగా పెరిగి 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయని ఆశించారు. అదే క్రమంలో ఒక పార్లమెంట్ స్థానం ఏర్పాటు చేస్తారని బలమైన ప్రచారం జరిగింది. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే మూడు నుంచి నాలుగు అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వేషన్ అవుతాయని భావించారు. కానీ తాజాగా పార్లమెంటులో జరిగిన వీగిపోయిన బిల్లు అన్ని వర్గాలపై నీళ్లు చల్లాయి.
మహిళలు, కొత్త నేతల ఆశలపై నీళ్లు..
మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు పదిమంది మహిళా నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో బలమైన నేతలుగా ఉన్న ఆదిలాబాద్ కు చెందిన మహిళ నేతలు సుహాసిని రెడ్డి, గండ్రత్ సుజాత, మంచిర్యాలకు చెందిన కొక్కిరాల సురేఖ, ముధోల్ కు చెందిన పడకండి రమాదేవి, ఖానాపూర్ కు చెందిన రాథోడ్ సుమన్ బాయి, చెన్నూరుకు చెందిన నల్లాల భాగ్యలక్ష్మి, బెల్లంపల్లికి చెందిన అమ్ము రాజుల శ్రీదేవి, నిర్మల్ కు చెందిన వల్ల కొండ శోభ సత్యనారాయణ గౌడ్, కొరిపెల్లి విజయలక్ష్మి రామ్ కిషన్ రెడ్డి తదితరులు తమకు రిజర్వేషన్ కలిసి వస్తే ఖచ్చితంగా లాభం ఉంటుందని ఆశించారు. వీరితో పాటు వివిధ రంగాల్లో పేరు పొందిన కొంతమంది మహిళా నేతలు సైతం మహిళా రిజర్వేషన్లను ఆశించారు. కానీ తాజా పరిణామాలు ఆ నేతల్లో నిరాశను నింపాయి.
కొత్త అసెంబ్లీ స్థానాలను ఆశించిన నేతల్లోనూ..
కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త నియోజకవర్గాలు కచ్చితంగా ఏర్పాటు అవుతాయని ఆశించిన నేతలకు వీగిపోయిన పార్లమెంటు బిల్లు ఆశనిపాతంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో మూడు తూర్పు ప్రాంతంలో రెండు కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు అవుతాయని భావించారు. ప్రస్తుతం ఎస్టి రిజర్వుడ్ గా ఉన్న నియోజకవర్గాలు రెండు జనరల్ స్థానాలు అవుతాయని భావించారు. మరోవైపు నిర్మల్ జిల్లాలోని ఒక జనరల్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ తాజా పరిణామాలతో ఆ స్థానాల పై కన్నువేసిన నేతలకు షాక్ ఇచ్చింది.
దాదాపుగా పాత నేతలతోనే..
జమిలి ఎన్నికలు, మహిళా రిజర్వేషన్లు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు తర్వాత మాత్రమే ఎన్నికలు జరుగుతాయని నిన్నటిదాకా జరిగిన ప్రచారం పార్లమెంట్ లో జరిగిన సీన్ తర్వాత అంతా ఒట్టిదేనని తేలిపోయింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు, ఇద్దరు భారత్ రాష్ట్ర సమితి తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఉండగా... బిజెపి పార్లమెంటు సభ్యులు కొనసాగుతున్నారు. పార్లమెంటులో అన్ని బిల్లులు వీగిపోయిన నేపథ్యంలో.. వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల విషయంలోను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుడికే అవకాశం ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు గత ఎన్నికల్లో ఓడిపోయిన రాజకీయ పార్టీల అభ్యర్థులే మళ్లీ అవకాశం తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి పై స్థాయిలో బలంగా ఏమైనా ఒత్తిడిలు వస్తే మినహా గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లో మరోసారి తమ అదృష్టం పరీక్షించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.






