ఖజానాకు భారీగా గండి.. సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్!

by Jakkula.Mamatha |

జిల్లాలోని వాంకిడి సరిహద్దు గుండా రాత్రిల్లో సాఫీగా ఈ అక్రమ దందాలో దారిపొడవునా దళారులు డబ్బులు ఇచ్చుకుంటూ తమ పనికి అడ్డు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఖజానాకు భారీగా గండి.. సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్!
X

దిశ, ఆసిఫాబాద్: జిల్లాలోని వాంకిడి సరిహద్దు గుండా రాత్రిల్లో సాఫీగా ఈ అక్రమ దందాలో దారిపొడవునా దళారులు డబ్బులు ఇచ్చుకుంటూ తమ పనికి అడ్డు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకప్పుడు నిరంతర నిఘాతో కళకళలాడిన సరిహద్దు పోస్టులు..! ఇప్పుడు నిఘా లేక వెలవెలబోతున్నాయి. గతంలోనే కమర్షియల్ చెక్ పోస్టులను రద్దు చేసిన ప్రభుత్వం ఇటీవల రవాణా శాఖ ఆర్టీఏ చెక్ పోస్ట్‌లను సైతం మూసివేయడంతో సరిహద్దులు అక్రమార్కులకు అడ్డాగా మారుతున్నాయి. తనిఖీలు లేకపోవడంతో మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల మధ్య అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. ఇక ఈ మధ్య కాలంలో ఒక్క వాహనాన్ని పట్టుకొని పోలీసులు కేసు చేసి దాఖలు లేవు. ప్రధాన జాతీయ హైవే పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్న ఈ అక్రమ దందాలకు అడ్డుకట్ట పడటం లేదు. దీంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గంజాయి నుంచి పశువుల వరకు..

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని చెక్ పోస్ట్ ఎత్తివేతతో అక్రమ రవాణాదారులకు వరంగా మారింది. మహారాష్ట్ర చత్తీస్గడ్. బీహార్ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి భారీగా గంజాయి అక్రమ రవాణా అవుతుంది. అధికారుల తనిఖీలు లేకపోవడంతో కేటుగాళ్లు పక్కా ప్లాన్ తో సరిహద్దులు దాటుతున్నారు. అలాగే మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా పశువులను సరిహద్దు అడ్డాగా చేసుకొని రాత్రివేళల్లో యదేచ్ఛగా హైదరాబాద్ తరలిస్తున్నారు. ఒకే వాహనంలో పరిమితికి మించి పశువులను ఎక్కించి హింసిస్తూ అక్రమ రవాణా చేస్తున్నారు. పట్టించుకునే వారు కరువయ్యారు.

తెలంగాణలో పేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం దర్జాగా మహారాష్ట్రలోని పాలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఇక్కడ తక్కువ ధర కొనుగోలు చేసిన బియ్యాన్ని అక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో చెక్ పోస్ట్ లు ఉన్న సమయంలో గంజాయి పశువులు బియ్యం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పెద్ద మొత్తంలో సరుకులు స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితులపై కేసులు కూడా నమోదు చేశారు.

ప్రత్యేక నిఘా పెడితేనే..

వాణిజ్య రవాణా శాఖల చెక్ పోస్ట్లు లేకపోవడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడటమే కాకుండా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పందించి సరిహద్దులలో ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయాలని మొబైల్ తనిఖీలను పెంచాలని అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

Next Story