- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆదిలాబాద్ లో ఉద్రిక్తత..ఎంపీ నగేష్ ఇంటి ముట్టడి..!
ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆ

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఇంటిని ముట్టడించారు. రైతుల పట్ల కేంద్రం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసనలో భాగంగా..ఎంపీ ఇంటి ముందు మాజీమంత్రి జోగు రామన్నతో పాటు నేతలు బైటాయించి పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ఎంపీ ఇంటి ముట్టడి విషయం తెలుసుకున్న పోలీసులు మూడు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పించారు. బారికేడ్లను తోసుకుంటూ మాజీమంత్రితో పాటు నేతలు ఎంపీ ఇంటి వైపు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కేంద్రం తీరు ఏమాత్రం సరికాదంటూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్న డీఎస్పీ జీవన్ రెడ్డి.. జోగురామన్నతో పాటు ప్రధాన నేతలను బలవంతంగా వాహనాల వరకు తీసుకెళ్ళారు. ఈ క్రమంలో పోలీసులు,నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరువురి మధ్య తోపులాట జరగడంతో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. చివరికి మాజీ మంత్రిని పోలీసు వాహనంలో తరలించే ప్రయత్నం చేయగా.. వాహనాన్ని నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని దాటుకుని పోలీసులు రూరల్ స్టేషన్ కు ఆయనను తరలించగా.. సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ తో పాటు పలువురు నేతలు తిరిగి ఎంపీ ఇంటి ముందు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఇందులో నాయకులు విజ్జగిరి నారాయణ, గండ్రత్ రమేష్,అలాల్ అజయ్,సెవ్వ జగదీష్ పాల్గొన్నారు.
తేమ నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలనీ ఎన్నోమార్లు వినతులు ఇచ్చినా పట్టించుకునే నాథుడు లేదాని,తాజాగా ఎకరానికి ఏడూ క్వింటాళ్ళు మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుందన్న నిబంధనను తెచ్చి రైతులను కేంద్రం నట్టేట ముంచుతోందని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మండిపడ్డారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోళ్లకు కేంద్రం కొత్త నిబంధనలను తెస్తూ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు.పత్తి కొనుగోళ్ళు ప్రారంభమైన తొలిరోజు ఆరువందల పత్తి వాహనాలు వస్తే అందులో అయిదింటికి మాత్రమే పన్నెండు శాతం తేమ వచ్చిందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సీసీఐ నిబంధనలు సడలించాల్సింది పోయి.. స్థానిక ఎంపీ,ఎమ్మెల్యేలు వాటిని సమర్ధించడం అన్యాయమని మండిపడ్డారు. రైతులకు మద్దతు ఇవ్వకుండా,కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా వ్యవహరించడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకే ఎంపీ ఇంటి ముట్టడి చేశామని,పోలీసులను మొహరించి తమను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.సోయా కొనుగోళ్ళ కేంద్రాలను ప్రారంభించినప్పటికీ కొనుగోళ్ళు మాత్రం జరగడం లేదన్నారు.అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని,వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం తప్పదని స్పష్టం చేశారు.






