- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిమ్స్ లో టీబీ ఎక్స్ రే యంత్రం ప్రారంభం..
ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేసి ఆరోగ్య ఆదిలాబాద్ గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్య శాఖ అధికారులకు సూచించారు.

దిశ, ఆదిలాబాద్ : ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేసి ఆరోగ్య ఆదిలాబాద్ గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా వైద్య శాఖ అధికారులకు సూచించారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక రిమ్స్ ఆసుపత్రి ఆడిటోరియంలో నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీబీ నియంత్రణ పై ప్రతిజ్ఞ చేసి, ఆయుష్ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ వైద్య సేవలు అందించిన పలువురు వైద్యులకు, సిబ్బందికి, నిక్షయ మిత్రలకు కలెక్టర్, ఎంపీ ప్రశంసా పత్రాలను అందజేశారు.
నూతన టీబీ ఎక్స్ రే యంత్రాన్ని కలెక్టర్, ఎంపీ ఆవిష్కరించి, టీబీ వ్యాధి గ్రస్థులకు నిక్షయా పోషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభమైన ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా సేఫ్ మదర్ హుడ్, ఎయిడ్స్ నివారణ, ఆయుష్ వంటి అంశాలపై వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. రిమ్స్ ఆసుపత్రి జిల్లాకే కాకుండా పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని కొనియాడారు. ముఖ్యంగా సర్జికల్ ఆంకాలజీ విభాగంలో జరుగుతున్న శస్త్రచికిత్సలు, శిశు మరణాల రేటును తగ్గించేందుకు చేపట్టిన 'సంకల్ప' ప్రోగ్రామ్ ద్వారా రిమ్స్ కు జాతీయ స్థాయి గుర్తింపు, టీబీ నివారణలో జిల్లా యంత్రాంగం సాధించిన పురోగతికి గాను అవార్డులు రావడం అభినందనీయమన్నారు.
ప్రతి ఒక్కరు ఆరోగ్య స్పృహ కల్గి ఉండాలి.. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్
ప్రస్తుత సమాజంలో 30-40 ఏళ్లకే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని, ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగితే ప్రభుత్వం వైద్యం కోసం చేసే భారీ ఖర్చు తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్పవరం యోగా అని, శాస్త్రీయంగా దీనివల్ల మందుల వాడకం దాదాపు 44 శాతం తగ్గిందని అనేక పరిశోధనలు నిరూపిస్తున్నాయని వివరించారు. యోగాను అలవరచుకోవడం ద్వారా సుమారు 50 నుంచి 60 శాతం వరకు రోగాల బారిన పడకుండా ఉండవచ్చని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, లీగల్ అడ్వైజర్ దాసరి గంగారం, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






