- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏసీపీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు.. 2000 లీటర్ల బెల్లపు పానకం ధ్వంసం
దేవులవాడలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భారీగా గుడుంబా స్వాధీనం చేసుకున్నారు.

దిశ, కోటపల్లి: కోటపల్లి మండలం నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా (డిఐజి) ఐపీఎస్, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవులవాడ గ్రామంలో ఆకస్మికంగా ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం’ నిర్వహించారు. సుమారు 50 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేస్తూ.. నివాసితుల వివరాలను సేకరించారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చారా లేదా అనుమానాస్పద వ్యక్తులు తలదాచుకుంటున్నారా అనే కోణంలో విస్తృతంగా సోదాలు నిర్వహించి, సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..
ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించిన ఆయన, ముఖ్యంగా ‘అరైవ్ అలైవ్’ ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, అతి వేగం వంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయని, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని ఆయన ఉదాహరణలతో వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల పత్రాలను కలిగి ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు...
అనంతరం గ్రామంలోని గుడుంబా ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి, సుమారు 2000 లీటర్ల బెల్లపు పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే 70 లీటర్ల నిషిద్ధ గుడుంబాను స్వాధీనం చేసుకుని, దాని తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. మహిళలు, చిన్న పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఏదైనా ఆపద కలిగితే వెంటనే స్థానిక పోలీసులకు లేదా ‘డయల్ 100’కు సమాచారం ఇవ్వాలని కోరారు. గ్రామాల రక్షణ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, అవి నేరాల అదుపులో కీలక పాత్ర పోషిస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, రూరల్ సీఐ ఆర్.కృష్ణ, ఎస్సైలు సుబ్బారావు, రాజశేఖర్, జగదీశ్వర్ రెడ్డి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..






