- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆదర్శం.. గోయగాం విద్యాలయం’.. గురుకులాల్లో సత్తా చాటిన విద్యార్థులు
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం గోయగాం ఎంపీపీఎస్ పాఠశాల గ్రామస్థుల సహకారంతో ఆదర్శంగా నిలుస్తోంది.

దిశ,ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం గోయగాం ఎంపీపీఎస్ పాఠశాల గ్రామస్థుల సహకారంతో ఆదర్శంగా నిలుస్తోంది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, యువత కలిసి పనిచేయడంతో పాఠశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. పాఠశాలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంగా మార్చడం, నాణ్యమైన బోధన అందించడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పాఠశాల అభివృద్ధి కోసం గ్రామంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు.
ఈ విధంగా గ్రామం మొత్తం పాఠశాల అభివృద్ధికి అండగా నిలవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉపాధ్యాయుల కృషితో విద్యార్థులు సైతం టాలెంట్, గురుకుల పరీక్షల్లో సత్తా చాటి రాణిస్తున్నారు. గ్రామస్థుల ఐక్యత,ఉపాధ్యాయుల అంకితభావం కలిసివస్తే ప్రభుత్వ పాఠశాలలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించగలమని గోయగాం పాఠశాల నిరూపిస్తోంది. జిల్లాలో ఆదర్శంగా నిలుస్తున్న ఈ పాఠశాల పై ప్రత్యేక కథనం.
విరాళాలతో బలోపేతం..
గోయగాం పాఠశాల అభివృద్ధి కోసం గ్రామంలో అనేక మంది దాతలు ముందుకు వచ్చి సహకరిస్తున్నారు. కెరమెరి మండల ఎంఈవో ఆడే ప్రకాష్ రూ.5 వేల, కేంద్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కాడెర్ల రంగయ్య రూ.5 వేల విరాళం అందించారు.
పాఠశాల ఉపాధ్యాయుడు కాలేరి రవితేజ ప్రతి నెల రూ.2 వేల చొప్పున అందిస్తూ మొత్తం రూ.24 వేల విరాళంగా ఇస్తున్నారు.గ్రామ యువత రూ.30 వేల విలువ చేసే బెంచీలను పాఠశాలకు అందించారు.విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొందరు విజయ్, సుధాకర్ లు టైలు, బెల్టులు, బ్యాగులు వంటి సామగ్రిని సమకూర్చగా,మరికొందరు రూ.5 వేల నగదు విరాళం అందించారు. ఈ విధంగా గ్రామస్థులు అందరూ కలిసి పాఠశాల అభివృద్ధికి బలంగా నిలుస్తున్నారు.
ఇంగ్లీష్ మీడియం దిశగా..
గత సంవత్సరం జూన్‌లో నిర్వహించిన గ్రామ సభలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల వైపు మళ్లించాలని గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు ఏకగ్రీవంగా నిర్ణయించారు. అందులో భాగంగా పాఠశాలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంగా మార్చారు. గ్రామస్థుల సహకారంతో ఇద్దరు అదనపు ఉపాధ్యాయులను నియమించడం ద్వారా బోధన నాణ్యత పెరిగింది.ప్రతి నెల పేరెంట్-టీచర్ మీటింగ్‌లు నిర్వహిస్తూ, ప్రతి తరగతికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. ఈ చర్యలు పాఠశాలపై నమ్మకాన్ని పెంచాయి.
విజయాల వైపు విద్యార్థుల అడుగులు..
గోయగాం పాఠశాల విద్యార్థులు చదువుల్లోనే కాకుండా పోటీ పరీక్షల్లో కూడా ప్రతిభ కనబరుస్తున్నారు. చుక్క రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ టాలెంట్ టెస్ట్‌లో పాఠశాల నుండి 6వ తరగతి కోసం నలుగురు విద్యార్థులు పార్ది అవంతిక, సోనులే సౌజన్య, సోనులే మోక్షిత, సోనూర్లే మోతిరాం ఎంపిక కావడం గర్వకారణం. వీరికి హైదరాబాద్‌లోని ప్రగతి విద్యానికేతన్‌లో ఉచిత విద్య లభించనుంది.అదేవిధంగా 4వ తరగతి గురుకుల పరీక్షల్లో ఐదుగురు విద్యార్థులు చిప్పకుర్తి శివాత్మిక, నరిగే వరలక్ష్మి, మహాత్మా రిషివిత, చిప్పకుర్తి శ్రీజ, శేణిగారపు నేత్రలు సీట్లు సాధించారు. ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయాలు సాధ్యమయ్యాయి.
నాణ్యమైన బోధన అందిస్తున్నాం: హెచ్ఎం కొట్నాక మహేశ్వర్
మా పాఠశాలలో నాణ్యమైన బోధన అందిస్తున్నామని హెచ్ఎం కొట్నాక మహేశ్వర్ తెలిపారు. పాఠశాలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంగా మార్చి బోధనను సమర్థవంతంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల పేరెంట్-టీచర్ సమావేశాలను సక్రమంగా నిర్వహిస్తూ,ప్రతి తరగతికి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేశాం. ఈ గ్రూపుల ద్వారా విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులతో పంచుకుంటూ వారి సూచనలు కూడా తీసుకుంటున్నాం. గోయగాం గ్రామస్థుల సహకారం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.






