మంత్రి ఇలాకాలో దుర్భరమవుతున్న విద్యార్థుల జీవితాలు

by Batti.Sumithra |

సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత పది రోజుల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించడం లేదని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ విమర్శించారు.

మంత్రి ఇలాకాలో దుర్భరమవుతున్న విద్యార్థుల జీవితాలు
X

దిశ, చెన్నూర్ : సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత పది రోజుల్లో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించడం లేదని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పది రోజుల క్రితం గంగారం గ్రామానికి చెందిన ఒక విద్యార్థిని పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు తెలిపారు. అనంతరం అదే పాఠశాలలో శనివారం రోజున మరో విద్యార్థిని డెట్టాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలో వరుసగా ఆత్మహత్య ఘటనలు జరుగుతున్నా మంత్రి స్పందించకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

పాఠశాలలో అసలు ఏమి జరుగుతుందో తల్లిదండ్రులకు తెలియాల్సిన అవసరం ఉందని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ పాఠశాల సిబ్బంది వాటిని రహస్యంగా ఉంచారని ఆరోపించారు. దీనిపై అధికారులు కూడా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మంత్రికి తెలుసా అని ప్రశ్నించారు. గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి చదువుకోడానికి వస్తున్నప్పటికీ సరైన వసతులు, బోధనా సిబ్బంది లేవని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వం, మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు. ఇప్పటికైనా మంత్రి స్పందించి గురుకుల పాఠశాలలోని సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోకుంటే క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయబ్, కొప్పుల రవీందర్, రేణిగుంట్ల శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story