గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి

by Taduka Kalyani |

జిల్లాలో గంజాయి సాగు చేసే, వినియోగించే, అక్రమ రవాణా నిర్వహించే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు.

గంజాయి సాగు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలి
X

దిశ, కాగజ్‌నగర్: జిల్లాలో గంజాయి సాగు చేసే, వినియోగించే, అక్రమ రవాణా నిర్వహించే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మోర్మాట్, అదనపు ఎస్పీ అడ్మిన్ చిత్రరంజన్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గంజాయి సాగు, వినియోగం, అక్రమ రవాణాపై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, మత్తు ప్రభావంతో అనేక నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గంజాయి సాగు చేసే వారిని గుర్తించి వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను రద్దు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ గంజాయి సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల భవిష్యత్తు దెబ్బతింటుందని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. అలాగే కల్లు కాంపౌండ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, దినసరి కూలీలకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని, వాహనాలు, ఆటోలను ప్రతిరోజూ తనిఖీ చేయాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో కళాజాత బృందాల ద్వారా గంజాయి సాగు, వినియోగం, రవాణాపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే నష్టాలను ప్రజలకు తెలియజేయాలని, వైద్య బృందాలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాల అక్రమ రవాణా జరగకుండా వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయాలని, మెడికల్ షాపుల్లో అధిక మోతాదులో విక్రయించే మందులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story