- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీధి కుక్కలకు వింత వ్యాధి.. చిన్నారులపై దాడులతో ప్రజల్లో భయాందోళన
మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో తిరుగుతున్న వీధి కుక్కలకు వింత వ్యాధులు సోకుతున్నాయి.

దిశ, బజార్‌హత్నూర్: మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో తిరుగుతున్న వీధి కుక్కలకు వింత వ్యాధులు సోకుతున్నాయి. గజ్జి, తామర వంటి చర్మవ్యాధులు సోకి రక్తస్రావంతో తీవ్రంగా బాధపడుతున్న కుక్కలు ఎండ వేడిని తట్టుకోలేక ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోనే ఒక వీధి కుక్క ఈరోజు మృతి చెందడం స్థానికులను కలవరపరిచింది. చర్మవ్యాధులతో బాధపడుతూ రక్తం కారడం, దుర్వాసన వ్యాపించడం వల్ల ప్రజలు అక్కడికి వెళ్లడానికి కూడా వెనుకాడుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కొన్ని చోట్ల వీధి కుక్కలు చిన్నారుల పై దాడి చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నారు.
పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఆటల కోసం బయటకు వచ్చే పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వింత వ్యాధులతో బాధపడుతున్న ఈ కుక్కలు ఎప్పుడు ఎవరి పై దాడి చేస్తాయో తెలియక ప్రజలు తీవ్ర ఆందోళనలో జీవిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధుల్లో తిరగడానికి ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పశు వైద్య అధికారులు వెంటనే స్పందించి వ్యాధిగ్రస్త కుక్కలను గుర్తించి చికిత్స చేయాలని, అవసరమైతే వాటిని ఇతర ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వీధి కుక్కల నియంత్రణ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, చిన్నారుల భద్రత దృష్ట్యా సంబంధిత శాఖలు తక్షణ చర్యలు చేపట్టకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.






