ఆయుష్ లో ఆగమాగం.. రెండు నెల‌లుగా తెరచుకోని వైద్య‌శాల

by Ratna Kumari |

దిశ, కన్నెపల్లి : మండ‌ల కేంద్రంలో ప్ర‌భుత్వ ఆరోగ్య స్వ‌స్థ‌త కేంద్రం దాదాపు 2 నెలల కాలం నుంచి మూసివేసి ఉంటున్న విష‌యం తెలిసిందే. దీంతో మండ‌లంలోని ప్ర‌జ‌ల‌కు ఆయూష్

ఆయుష్ లో ఆగమాగం.. రెండు నెల‌లుగా తెరచుకోని వైద్య‌శాల
X

దిశ, కన్నెపల్లి : మండ‌ల కేంద్రంలో ప్ర‌భుత్వ ఆరోగ్య స్వ‌స్థ‌త కేంద్రం దాదాపు 2 నెలల కాలం నుంచి మూసివేసి ఉంటున్న విష‌యం తెలిసిందే. దీంతో మండ‌లంలోని ప్ర‌జ‌ల‌కు ఆయూష్ వైద్య సేవ‌లు అంద‌డం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందించాల‌నే ఉద్దేశంతో భార‌త ప్ర‌భుత్వం ఆయుర్వేద వైద్య సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా ఆయుష్మాన్ భార‌త్ కి శ్రీకారం చుట్టింది. అయితే క‌న్నెప‌ల్లి మండ‌ల కేంద్రంలో పని చేసే వైద్యాధికారి గ‌త రెండు నెల‌లుగా విధులు మ‌రోచోట నిర్వ‌ర్తిస్తూ.. మండ‌ల కేంద్రంలో ప‌ని చేస్తున్న‌ట్టుగా వేత‌నం తీసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అయితే ఉన్న‌తాధికారులు మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.


ముఖ్యంగా కన్నెపల్లి మండలంలో 15 గ్రామ పంచాయతీలలో సుమారు ఇరవై వేలకు పైగా జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి అందుతున్న వైద్య సేవలు అంతంత మాత్రమే అని చెప్ప‌వ‌చ్చు. ప్రభుత్వ ఆరోగ్య స్వస్థత కేంద్రంలో గతంలో ఇక్కడ పనిచేసిన‌ వైద్యాధికారి ప్రవీణ్ డిప్యూటేషన్ పై మెదక్ జిల్లాలోని తుఫ్రాన్ లో విధులు నిర్వర్తిస్తూ కన్నెపల్లి మండలంలో పనిచేస్తున్నట్లు జీతాన్ని తీసుకుంటున్నాడు. గత రెండున్నర సంవత్సరాల క్రితం ఇక్కడ వీధుల్లో చేరి కేవలం రెండు నెలలు మాత్రమే కన్నెపల్లి మండల కేంద్రంలో పనిచేసే అనంతరం డిప్యూటేషన్ పై మెదక్ జిల్లా తూప్రాన్ కు వెళ్లారు. ఇక్కడ తాత్కాలికంగా బెల్లంపల్లి ప్రభుత్వ వైద్యశాలలో పని చేస్తున్న ఓ వైద్యాధికారిని ఇంచార్జిగా నియమించారు. ఆయన వారంలో మూడు రోజులు వస్తూ ముఖ్యంగా గురు, శుక్ర, శనివారాల్లో మండలంలోని ఆరోగ్య స్వస్థత కేంద్రానికి ఉదయం పది గంటలకు వచ్చి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉండి వెళ్లేవారు. గత 2 నెలలుగా ఇంచార్జి వైద్య సిబ్బంది కూడా రాకపోవడంతో ఇక్కడ కంపౌండర్, అటెండర్ పోస్టులు సైతం ఖాళీగా ఉండడంతో ఆరోగ్య స్వస్థత కేంద్రాన్ని తెరిచే నాధుడే కరువయ్యాడు. శాఖలో ఇంత జరుగుతున్న ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇష్టానుసారంగా వైద్యాధికారులు పని చేస్తున్నారు.

గ్రామస్తులు వైద్యాధికారి నియామకంపై ఫిర్యాదు చేసినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు శూన్యం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించే వైద్య సిబ్బంది నెలల తరబడి విధులకు రాకుండా ఆరోగ్య కేంద్రాన్ని మూసి ఉన్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు మండలంలోని ఆయుష్ వైద్య సేవలపై ఆరా తీయకపోవడం ఆ శాఖలోని నిర్లక్ష్యానికి నిదర్శనం. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలే దిక్కుఅయ్యాయి. ఓవైపు సీజనల్ వ్యాధులు ప్రబలించి జ్వరాలు ప్రజలను పట్టిపీడిస్తుంటే.. ప్రభుత్వ ఆయుష్ వైద్య శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా 2 నెలలుగా ఆరోగ్య స్వస్థత కేంద్రం మూసి ఉంచడంపై ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రజలకు బిపి, షుగర్, ఇతర వ్యాధులకు వైద్య సేవలు ఉచితంగా అందించాల్సిన వైద్య సిబ్బంది రాక ఆరోగ్య కేంద్రం మూసి ఉండ‌టంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేట్ వైద్యశాలలో వేల రూపాయలు ఖర్చు చేసుకొని ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండల కేంద్రంలోని ఆరోగ్య స్వస్థత కేంద్రంలో వైద్యాధికారి ఇతర సిబ్బందిని నియమించి వైద్య సేవలు అందించాలని ప్రజల కోరుతున్నారు

డిప్యూటేషన్ పై పంపించడంతో..

కన్నెపల్లి మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న. నాకు మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో డిప్యూటేషన్ పై పంపించడంతో నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే పని చేస్తున్నాను.

వైద్యుడిని నియమిస్తాం : ప్రమీలాదేవి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్

కన్నెపల్లిలో తాత్కాలికంగా పనిచేసే వైద్యాధికారి ఆరోగ్య పరిస్థితుల కారణంగా విధులకు హాజరు కాకపోవడంతో గత 2 నెలలుగా మూసి ఉంది. కన్నెపల్లి ఆరోగ్య స్వస్థత కేంద్రంలో త్వరలోనే రెగ్యులర్ వైద్యుడిని నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. గతంలో కన్నెపల్లిలో పని చేసే రెగ్యులర్ వైద్యాధికారి మెదక్ జిల్లాలోని తూప్రాన్ లో విధులు నిర్వహిస్తున్నారు. కన్నెపల్లికి వెళ్లేందుకు ఎవరు సుముఖత చూపకపోవడంతో గత కొంతకాలంగా వైద్య సిబ్బంది లేక ఆరోగ్య స్వస్థత కేంద్రం మూసి ఉంది. వైద్యాధికారిని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు లేఖ రాశామని తెలిపారు.

Next Story