కోల్డ్ రిఫ్ సిరప్ వినియోగం నిలిపివేయండి : డా. అనిత

by Ratna Kumari |

దిశ, మంచిర్యాల : చిన్న పిల్ల‌ల్లో ద‌గ్గును నియంత్రించేందుకు వినియోగించే కోల్డ్ రిఫ్ సిరప్ వాడకాన్ని నిలిపివేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ

కోల్డ్ రిఫ్ సిరప్ వినియోగం నిలిపివేయండి :  డా. అనిత
X

దిశ, మంచిర్యాల : చిన్న పిల్ల‌ల్లో ద‌గ్గును నియంత్రించేందుకు వినియోగించే కోల్డ్ రిఫ్ సిరప్ వాడకాన్ని నిలిపివేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.అనిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డి.జి. హెచ్.ఎస్.), తెలంగాణ రాష్ట్ర వైద్య-ఆరోగ్యశాఖ డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం.. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో కోల్డ్ రిఫ్ సిరప్ వినియోగించడం వెంటనే నిలిపివేయాలన్నారు. సిరప్ సంబంధిత నిల్వలు జిల్లాలో అందుబాటులో లేవని, జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు, ఫార్మాసిస్టులు, ఏజెన్సీలు తమ వద్ద సిరప్ నిల్వలు ఉన్నట్లయితే వెంటనే సమాచారం అందించాలని తెలిపారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రేసన్ ఫార్మా మే 2025 నెలలో తయారు చేసిన బ్యాచ్ నం.ఎస్ఆర్-13 నుంచి వచ్చిన కోల్డ్ రిఫ్ సిరప్ వినియోగించడం వల్ల‌ చిన్న పిల్లలలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఈ మందు నిషేధించడం జరిగిందన్నారు.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో చాలా మంది పిల్లల మరణానికి కోల్డ్ రిఫ్ సిరప్ వినియోగంతో సంబంధం ఉండటంతో ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రకారం నమోదు చేసుకున్న అన్ని ఆసుపత్రులు, ఫార్మసీ కేంద్రాలు, చిన్నపిల్లల వైద్యులు, ప్రైవేట్ వైద్యుల వద్ద కోల్డ్ రిఫ్ సిరప్ లు ఉండరాదన్నారు. సిరప్ నిల్వలు కలిగి ఉన్న వారు జిల్లా వైద్య-ఆరోగ్యశాఖ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబ‌ర్ 1800 599 6969 లో వివరాలు అందించాలని తెలిపారు. జిల్లాలోని ప్రభావిత బ్యాచ్ సిరప్ నిల్వలను గుర్తించి, నిలిపివేయడానికి ఫార్మసీలు, హోల్ సేల్ వ్యాపారులు, ఆసుపత్రులను అప్రమత్తం చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు తమ పరిధిలోని గ్రామాలలో ఉన్న ఫార్మసీల వద్ద ఉన్న సిరప్ ల వివరాలు తీసుకోవాలని తెలిపారు. 2 సం.ల వయస్సు లోపు గల పిల్లలకు ఎలాంటి దగ్గు మందుల వినియోగానికి వైద్యులు సూచించరాదని, తల్లిదండ్రులు పిల్లల వైద్య నిపుణుల సూచన ద్వారా మాత్రమే మందులను వినియోగించాలని, ఫార్మాసిస్టులు, డ్రగ్గిస్ట్ లు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Next Story