నకిలీ సీడ్స్ దందా.. ఆందోళ‌న‌లో రైతులు

by velandi.Saikiran |   (  Updated:2026-04-26 02:32:10  IST  )

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది.

నకిలీ సీడ్స్ దందా.. ఆందోళ‌న‌లో రైతులు
X

నకిలీ సీడ్స్ దందా..

=ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల కలకలం

=అసలైన విత్తనాల పేరుతో నకిలీ ప్యాకెట్ల విక్రయం

=పోలీసు, వ్యవసాయ శాఖ దాడులతో మోసాలు వెలుగులోకి

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. అసలైన కంపెనీల పేర్లతో నకిలీ పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కంది వంటి పంటల విత్తనాలను విక్రయిస్తూ కొందరు వ్యాపారులు రైతులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వర్షాకాలం సాగు సీజన్ ప్రారంభం కావడంతో రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి విత్తనాలు కొనుగోలు చేస్తున్న సమయంలో ఈ మోసాలు మరింత పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ప్రైవేట్ వ్యాపారులు నకిలీ విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా బేల మండలంలో నకిలీ విత్తనాల మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పలువురిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రతి ఏటా కొంతమంది ఈ దందా చేస్తూ పట్టుబడుతున్నా..ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి.

ప్రతి ఏటా ఫేక్ సీడ్ దందా..

ప్రతి ఏటా వర్షాకాలం సాగు సీజన్ ప్రారంభం కాగానే నకిలీ విత్తనాల దందా జిల్లాలో మళ్లీ తలెత్తుతోంది. పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ నిందితులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ ఈ అక్రమ వ్యాపారం ఆగడం లేదు.రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు ముఠాలు భారీగా నకిలీ విత్తనాలను మార్కెట్‌లోకి పంపిస్తున్నాయి. గతేడాది కూడా జిల్లాలో భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని పలువురిపై కేసులు నమోదు చేశారు.అయినప్పటికీ ఈ దందా పూర్తిగా అరికట్టలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా నకిలీ విత్తనాల నిల్వలు బయటపడ్డాయి.అనుమానాస్పద ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.నకిలీ విత్తనాల విక్రయానికి పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠాలపై కూడా ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

నకిలీ విత్తనాలతో తీవ్ర నష్టం..

కొంతమంది వ్యాపారులు గ్రామాల్లోకి వెళ్లి నేరుగా రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో అసలైన కంపెనీ పేర్లు చెప్పి నకిలీ ప్యాకెట్లను అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.ప్యాకెట్‌పై కంపెనీ పేరు, తయారీ తేదీ,గడువు,ఎంఆర్పీ వంటి వివరాలు లేకపోయినా రైతులు నమ్మి కొనుగోలు చేస్తున్నారు.కొందరు వ్యాపారులు తక్కువ ధరకు ఇస్తామని చెప్పి రైతులను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో రైతులు మోసపోయిన తర్వాతే నిజం బయటపడుతోంది.కాగా రైతులు అధిక దిగుబడి ఆశించి కొనుగోలు చేసిన విత్తనాలు మొలకెత్తకపోవడం,మొలకెత్తినా నాణ్యత లేకపోవడం వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఒకసారి విత్తనం విఫలమైతే తిరిగి సాగు చేయడానికి రైతులకు అదనపు ఖర్చు భారం పడుతోంది.ఇప్పటికే అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న రైతులు మరింత అప్పుల పాలవుతున్నారు. ఒక్కో ఎకరానికి వేల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.కొందరు రైతులు పంటలు పూర్తిగా నష్టపోయి కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ నకిలీ సీడ్స్ దందా చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతులకు అధికారుల సూచనలు..

రైతులు తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.కొనుగోలు సమయంలో బిల్లు తీసుకోవడం, ప్యాకెట్పై ఉన్న వివరాలు పూర్తిగా పరిశీలించడం అవసరమని తెలిపారు.కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, ఎమ్మార్పీ వంటి వివరాలు లేని విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనవద్దని హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై సమాచారం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసులకు తెలియజేయాలని కోరారు. రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Next Story