నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

by Batti.Sumithra |

నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు
X

దిశ, మంచిర్యాల : నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం నస్పూర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నకిలీ పత్తి విత్తనాల వినియోగం వల్ల కలిగే నష్టాల పై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచనలు చేశారు. నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేసే దళారులపై పోలీసు శాఖ నిఘ పటిష్టం చేయాలని అన్నారు.

లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద రైతులు విత్తనాలను కొలువలు చేసే విధంగా వ్యవసాయ అధికారులు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాల వినియోగం, కలుపు నివారణకు ఉపయోగించే గ్లైపోసిట్ గడ్డి మందు తో క్యాన్సర్ వ్యాధి సోకే ప్రమాదం ఉందన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన, తనిఖీలు చేయాలన్నారు. జిల్లాలోని సరిహద్దుల చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ నిషేధిత నకిలీ పత్తి విత్తనాల అక్రమ దందా చేస్తే ఎంతటి వారైనా సహించేది లేదన్నారు. నకిలీ విత్తనాల విక్రేతలపై నిఘ ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో నకిలీ దందాపై ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాసరావు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని సురేఖ, మంచిర్యాల బెల్లంపల్లి, జైపూర్, ఏసీపీలు ప్రకాష్, కిరణ్ కుమార్, వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story