గిరిజన గ్రామాల్లో విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

by Taduka Kalyani |

గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు.

గిరిజన గ్రామాల్లో విద్య, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
X

దిశ, ఉట్నూర్ : గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తోందని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని దొంగచింత గిరిజన గ్రామంలో ఆయన పర్యటించి గ్రామంలోని పరిస్థితులను పరిశీలించారు. పీవో రాకతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, విద్యా పరిస్థితులపై స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలోని గిరిజన వీరులైన కుంరం సూర్, కొమురం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధనా విధానం, పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజన నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, సూచించారు. విద్యార్థులతో కలిసి కొంతసేపు గడుపుతూ వారిలో ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని నింపారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని పీవో ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన, పౌష్టికాహారం, పరిశుభ్రమైన పాఠశాల వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అంతకుముందు గ్రామంలో పర్యటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీవో వెంట ఐటీడీఏ అధికారులు ఉన్నారు.

Next Story