పునరావాసం, ఆదివాసీలపై ప్రత్యేక శ్రద్ధ.. వినూత్న కార్యక్రమాలకు డీజీపీ శ్రీకారం....

by Kodari Anjali |   (  Updated:2026-04-13 14:29:43  IST  )

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

పునరావాసం, ఆదివాసీలపై ప్రత్యేక శ్రద్ధ..  వినూత్న కార్యక్రమాలకు డీజీపీ శ్రీకారం....
X

దిశ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర డీజిపి బి. శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సీసీటీవీ విస్తరణ, మహిళల భద్రత, ట్రాఫిక్ అవగాహన, ప్రజా రవాణా భద్రతకు సంబంధించిన పలు చర్యలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలో 207, మండలాలు–గ్రామాల్లో 283 కలిపి మొత్తం 490 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 700 కెమెరాల ద్వారా 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతోంది. నేరాల నియంత్రణలో సీసీటీవీల పాత్ర కీలకమని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

మహిళల భద్రత, ట్రాఫిక్ అవగాహన..

మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆపరేషన్ జ్వాలా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశారు.జిల్లా వ్యాప్తంగా వేలాది బాలికలకు కరాటే శిక్షణ అందించి ఆత్మస్థైర్యం పెంపొందించారు. ఖాకీ కిడ్స్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే అవగాహన పెంచేందుకు జిల్లాలో ట్రాఫిక్ పార్క్‌ను కూడా ప్రారంభించారు.

బస్సులో భరోసా.. ప్రయాణికులకు భద్రత..

ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సులో భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో 175 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి భద్రతను పెంచారు. ఈ కెమెరాల ద్వారా బస్సుల్లో జరిగే దొంగతనాలు, మహిళలపై వేధింపులను గుర్తించి అరికట్టే అవకాశం ఉంటుందని తెలిపారు.

మాజీ మావోయిస్టులకు ఇళ్ల స్థలాలు..

జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు సభ్యులకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ ఇళ్ల స్థలాలు అందజేసింది. అలాగే విధుల్లో మృతిచెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఆర్థిక సాయం, కారుణ్య నియామకాలు అందజేశారు.

ఆదివాసీ అభివృద్ధికి పోలీసుల ముందడుగు..

చించుఘాట్ గ్రామంలో ఆదివాసీ యువత కోసం ఆధునిక లైబ్రరీ ప్రారంభించి, పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు. పోలీసు మీకోసం కార్యక్రమం ద్వారా ఆదివాసీలకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించగా, వారు కూడా భద్రతా నియమాలు పాటిస్తామని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పి అండ్ ఎల్ ఐజి గజరావ్ భూపాల్ ఐపిఎస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, పరిపాలన అదనపు ఎస్పీ పి మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్సైలు, రిజర్వు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story