- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూడాన్ జాతీయుడికి ఎబోలా నెగిటివ్
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరిన సూడాన్ జాతీయుడికి ఎబోలా నెగెటివ్‌గా తేలింది.

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరిన సూడాన్ జాతీయుడికి ఎబోలా నెగెటివ్‌గా తేలింది. ఈ మేరకు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిర్ధారించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో గత కొన్ని రోజులుగా నగరంలో నెలకొన్న ఎబోలా భయాలకు తెరపడింది. ఇటీవల సూడాన్ నుంచి నగరానికి వచ్చిన మహమ్మద్ యగౌచ్ అహ్మద్ (36) అనే విద్యార్థికి శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ నిర్వహించగా ఎబోలా అనుమానిత లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యాధికారులు అతడిని, అతడితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని గాంధీ ఆస్పత్రిలోని 20 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. వీరి నుంచి సేకరించిన రక్త నమూనాలను తొలుత సీసీఎంబీకి, అక్కడి నుంచి తుది పరీక్షల నిమిత్తం పుణెలోని ఎన్ఐవీకి పంపారు. తాజాగా ఆ పరీక్షల్లో ఎబోలా వైరస్ లేదని నెగెటివ్ రిపోర్ట్ రావడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
విమానాశ్రయంలో హై అలర్ట్.. 21 రోజుల నిఘా
మధ్య ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఎబోలా లక్షణాలు కనిపించిన ప్రయాణికులను వెంటనే గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డుకు తరలించి, నమూనాలను పుణె ఎన్ఐవీకి పంపుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేని ప్రయాణికులను హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తూ, ముందస్తు జాగ్రత్తగా 21 రోజుల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఎబోలాపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజారోగ్య రక్షణకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. అయితే, విదేశాల నుంచి వచ్చిన వారిలో గానీ, ఇతరులలో గానీ జ్వరం, తీవ్రమైన అలసట, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని ఆయన సూచించారు.






