- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గిరిసీమలో విత్తన పూజలు
సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ, ఆచరిస్తూ పాటించడంలో ఆదివాసీ గిరిజనులు ముందు వరుసలో ఉంటారు.

దిశ, ఉట్నూర్ : సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ, ఆచరిస్తూ పాటించడంలో ఆదివాసీ గిరిజనులు ముందు వరుసలో ఉంటారు. ఆదివాసీ గిరిజనులు ఏ కార్యక్రమం చేపట్టాలన్న అందుకు కుల దైవాలకు ప్రత్యేక మొక్కులు, పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మృగశిర కార్తె రాగానే ఆదివాసీ గిరిజనులు కుల దైవాలకు మొక్కులు మొక్కి, విత్తన పూజలు చేయడంతోనే వ్యవసాయ సాగుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మృగశిర కార్తె ప్రారంభం కావడంతో ఏజెన్సీ లోని గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా ఆదివాసి రైతులు, ప్రజలు కుటుంబ సభ్యులతో కలసి విత్తన పూజలు చేస్తున్నారు. సాగుకు శ్రీకారం చుట్టి, ఈ ఏడాదిలో పంటలు సంవృద్దిగా పండాలని కుల దైవాలకు ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
విత్తన పూజాతోనే మొదలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాల్లో ఆదివాసీ ప్రజలు పంటల సాగుకు ముందుగా కుల దైవాలకు విత్తనాలు సమర్పించి పంటలకు ఎలాంటి చీడపీడలు రాకుండా, పంటలు సంవృద్ధిగా పంటలని పూజించి దైవాల ఆశీర్వాదం పొందే విజ్జా మోహితూర్ అనే ఏరువాక పండుగ సాంప్రదాయ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజ చేసిన అనంతరం వ్యవసాయ భూముల్లో సాగు పనులకు శ్రీకారం చుడతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజన ప్రధాన ఆలయాలు, దైవ క్షేత్రాలు అన్ని పూజలతో కిక్కిరిసిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, జైనూర్, నార్నూర్, గాదిగూడ, తీర్యాణి, కెరమెరి, లింగాపూర్ తదితర మండలంలోని ఆదివాసీ గిరిజన దేవుళ్లకు సంస్కృతి, సంప్రదాయాల బద్దంగా గ్రామస్తులంతా కలిసి ఒకే చోట కలిసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
దైవక్షేత్రాల్లో సందడి
అధికంగా ఆదివాసీలు నివసించే ఈ ఐదు మండలాల పరిధిలోని అనేక గ్రామాల్లో ఈ వేడుకలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. జైనూర్ మండలంలోని శివనూర్ అటవీ ప్రాంతంలో కొలువుదీరిన కిడపకిండి అవల్ పేన్, మర్లవాయి గ్రామ శివారులోని గండి అవల్ పేన్, సిర్పూర్ (యు) మండలంలోని సుంగాపూర్ అవల్ పేన్, సీతాగొంది గ్రామంలోని మసెమల్ పేన్, లింగాపూర్ మండలంలోని జాముల్దర అవల్ పేన్, కేరమేరి మండలంలోని పోతరాజుల్ పేన్, తిర్యాణి మండలంలోని మెస్రం గూడా గ్రామ సమీప గుట్టపై ఉన్న అర్జున్ లొద్ది అవల్ పేన్, ఉట్నూర్, జన్నారం మండలాల సరిహద్దులోని కవ్వల అటవీ ప్రాంతంలో ఉన్న డెబ్బమల రాజుల్ పేన్ వంటి ప్రధాన దైవక్షేత్రాల్లో విత్తనాల పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దైవస్థలాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. కుటుంబ సభ్యులంతా కలిసి పూజల్లో పాల్గొంటూ తమ సంస్కృతి, సంప్రదాయాలను తదుపరి తరాలకు పరిచయం చేస్తున్నారు.
అనాదిగా వస్తున్న ఆచారం
ఏజెన్సీ ప్రాంతాల్లో నీ గూడల్లో ఏడాది పాటుగా సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పూజలు, పండగలు నిర్వహిస్తూ తమకు తామే సాటిగా నిలుస్తున్నారు. మృగశిర కార్తె ప్రవేశించడంతో ఉమ్మడి జిల్లాలో గిరిజన గ్రామాల్లో విత్తన పూజ చేసి సాగును ప్రారంభించడం ఆచారంగా వస్తుందని ఆదివాసి పెద్దలు అంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించేందుకు తగు కృషి చేస్తున్నామని గిరిజనులు అంటున్నారు.






