- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ సమ్మె.. ఉద్రిక్తం..!
ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది.

దిశ, ఆదిలాబాద్ : ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది.ఆదిలాబాద్ బస్టాండ్ నుంచి పట్టణ పురవీధుల గుండా కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. బస్ డిపో ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని,ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత, పెండింగ్ ఏరియర్స్, పీఆర్సీ అమలు వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
పోలీసులతో ఉద్రిక్తత బీజేపీ నేతల అరెస్ట్..
నిరసనలో భాగంగా కార్మికులు వంటావార్పు చేపట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ వారిని నిలువరించారు.దీంతో పోలీసులు,కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.ఈ ఘటనలో పలువురు ఆర్టీసీ కార్మికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.ఆందోళనకు మద్దతుగా వచ్చిన బీజేపీ నేత పాయల్ శరత్,కౌన్సిలర్లను పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా కార్మికులు, బీజేపీ నాయకులు అడ్డుకున్నారు.అనంతరం పాయల్ శరత్‌తో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. భోజనం పెట్టేందుకు వస్తే అక్రమంగా అరెస్టు చేస్తారా అని నేతలు మండిపడ్డారు.
కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
వరంగల్ జిల్లా నర్సాంపేటలో ఆత్మబలిదానం చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్‌కు ఆదిలాబాద్ కార్మికులు ఘన నివాళులు అర్పించారు.ఆయన చిత్రపటంతో ర్యాలీ నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలపై స్పష్టత లేకపోవడం,సమస్యల పరిష్కారంలో ఆలస్యం చేయడం వల్లే శంకర్ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం దిగివచ్చి అన్ని డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.






