రహదారి భద్రత అందరి బాధ్యత.. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్

by Kodari Anjali |

ఆదిలాబాద్‌లో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.

రహదారి భద్రత అందరి బాధ్యత.. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
X

దిశ, ఆదిలాబాద్: రహదారి నిబంధనలు పాటించడం చట్టం కోసం మాత్రమే కాకుండా ప్రాణాల రక్షణ కోసం అనివార్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని రహదారి భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముందుగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన “అరైవ్ అలైవ్” రహదారి భద్రత అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి ముందు పాఠశాల విద్యార్థులతో కలిసి ‘హెల్మెట్–సేవ్ లైవ్స్’ ఆకారంలో భారీ మానవహారం ఏర్పాటు చేసి చైతన్యం కల్పించారు. విద్యార్థులు నినాదాలతో ప్రజల్లో అవగాహన పెంచారు. యువతకు లెర్నింగ్ లైసెన్సులు,డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేయడంతో పాటు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీని ప్రారంభించి స్వయంగా పాల్గొన్నారు.

మద్యం సేవించి వాహనం నడపడం వల్ల..

అంబేద్కర్ చౌక్‌లో వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రమాదాల నివారణకు అవగాహన, మెరుగైన రహదారులు, లోపాల సవరణ, కఠిన నిబంధనలు, తక్షణ వైద్యం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ముఖ్యంగా యువత అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని హెచ్చరించారు.అనంతరం చావర పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ‘చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్‌ను ప్రారంభించారు. విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించి, చిన్ననాటి నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన అవసరమని తెలిపారు. ఈ పార్క్ ద్వారా విద్యార్థులు ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులపై ప్రాక్టికల్ అవగాహన పొందగలరన్నారు.రోడ్డు భద్రతలో ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎమర్జెన్సీ అనే నాలుగు అంశాలు కీలకమని మంత్రి వివరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు..

‘రహవీర్’ అవార్డు ద్వారా ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పాఠ్యాంశాల్లో కూడా రహదారి భద్రతను చేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.ట్రాఫిక్ నియమాల పాటింపు ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. అనంతరం ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను మంత్రి అభినందించి మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి,ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ మల్లెపూల నర్సయ్య, జిల్లా ఇంచార్జి కలెక్టర్ యువరాజు మర్మాట్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పి. రవీందర్ కుమార్, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎస్. శ్రీనివాస్, అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కె. హరీంద్ర కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Next Story