మున్సిపల్ పోరులో ‘కాంగ్రెస్‌లో ‘రెబల్’ సెగ

by Malleboina Mahesh |

పురపాలక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ఎదురవుతున్న రెబల్స్ బెడద తీవ్ర ఇబ్బందిగా మారుతుంది.

మున్సిపల్ పోరులో ‘కాంగ్రెస్‌లో ‘రెబల్’ సెగ
X

దిశ, నిర్మల్ ప్రతినిధి: పురపాలక సంఘాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ నేతలకు ఎదురవుతున్న రెబల్స్ బెడద తీవ్ర ఇబ్బందిగా మారుతుంది. ప్రధానంగా సొంత పార్టీ నుంచి పెరుగుతున్న రెబల్స్ ముప్పు ఎన్నికల గెలుపు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న అభిప్రాయాలు పార్టీ పెద్దలను కలవరపెడుతున్నాయి. చైర్మన్ పదవులు రావాలంటే ముందుగా మెజారిటీ కౌన్సిలర్ సభ్యులు గెలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అయితే పలు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య పెద్ద మొత్తంలో పెరిగిపోతుండటంతో ఒక్కొక్క వార్డులో అభ్యర్థుల ఎంపిక తలకు మించిన భారంగా మారుతుంది.

ఐదు మున్సిపాలిటీల్లో తీవ్ర పోటీ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో త్వరలోనే జరగనున్న పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు బోధన్ శాసనసభ్యుడు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాలను ఇప్పటికే నిర్వహించారు. అయితే ఈ సమావేశాల సందర్భంగా అభ్యర్థుల ఎంపికపై తీవ్ర చర్చ జరిగింది. అయితే మున్సిపాలిటీలలో అభ్యర్థుల ఎంపికకు కమిటీలను వేసుకొని విజయం సాధించే అభ్యర్థులను గుర్తించాలని ఈ సందర్భంగా సూచించారు.

మరోవైపు మైనార్టీలు ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీలలో ఎలాగైనా వారి ఓటు బ్యాంకు నష్టపోకుండా ప్రయత్నించాలని కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో తీవ్రమైన రెబల్స్ బెడద జరుగుతుందని తెలుస్తుంది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి మున్సిపాలిటీలు సహా మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీలో రెబల్స్ బెడద ఎక్కువగా ఉన్నట్లు పార్టీ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో వారిని దారికి తెచ్చేందుకు నియోజకవర్గ ఇన్చార్జీలు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ పదవులు ఆశిస్తున్నవారికి ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.

రెబల్స్‌కు కో ఆప్షన్ ఛాన్స్..?

మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తరపున పోటీ పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోవడంతో వారిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టారు చెప్పినట్టు విని పోటీలో నుంచి విరమించుకున్న వారిని మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుడిగా అవకాశం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఇందుకు ఒప్పుకుంటున్నప్పటికీ అనేకమంది పోటీకి మొగ్గు చూపుతుండడంతో వారిని నయానో భయానో ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు అభ్యర్థులకు ఆర్థికపరంగా చేయూత ఇచ్చి పోటీ నుంచి తప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా రెబల్స్‌కు చెక్ పెట్టడం అధికార కాంగ్రెస్ పార్టీకి తీవ్ర తలనొప్పిగా మారుతున్నది.

Next Story