ప్రజా సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

by Taduka Kalyani |

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు
X

దిశ, ఉట్నూర్ : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామంలో ప్రజావాణి గ్రామసభ, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో మంద మకరంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గ రహదారుల కోసం రూ. 36 కోట్లు కేటాయించగా, అందులో హీరాపూర్ రోడ్డు పనులకే రూ. 12 కోట్లు వ్యయంతో చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ముత్నూర్, ఇంద్రవెల్లి ప్రాంతాల్లో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, హీరాపూర్‌ను పైలట్ ప్రాజెక్ట్ కింద పూర్తి స్థాయి సోలార్ గ్రామంగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని వెల్లడించారు. గిరిజన విద్యార్థుల పర్యవేక్షణకు వాట్సాప్ మానిటరింగ్ వ్యవస్థను తెచ్చామన్నారు. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. రెవెన్యూ సంబంధిత భూ సమస్యలను 10 నుంచి 15 రోజుల్లోగా పరిష్కరిస్తామని, ఏడు ఆవాస ప్రాంతాలకు రూ. 25 లక్షలతో త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, అటవీ హక్కు పత్రాలు, రెవెన్యూ పట్టాల సర్వే ప్రక్రియ కొనసాగుతోందని, వ్యవసాయ వారోత్సవాల్లో భాగంగా రైతులు తమ పొలాల్లో మట్టి పరీక్షలు చేయించుకోవాలని, రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని సూచించారు.

నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

ముఖ్యంగా పత్తి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే తీసుకోవాలని, నకిలీ విత్తనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రజావాణి కార్యక్రమాన్ని కేవలం జిల్లా కేంద్రానికే పరిమితం చేయకుండా, డివిజన్, మండల స్థాయిల్లోనూ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి దరఖాస్తును 30 రోజుల్లోగా పరిష్కరించి, బాధితులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ పీవో మంద మకరంద్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను గ్రీవెన్స్ రూపంలో నమోదు చేసుకొని రసీదు తీసుకోవాలని సూచించారు. 21 విభాగాలను సమన్వయం చేస్తూ సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అంతకుముందు గ్రామంలోని కొమురం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం పలువురు రైతులకు పలువురికి భూసార పరీక్ష విశ్లేషణ ధృవీకరణ పత్రాలను అందజేసి, విద్యుత్ జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలపై పలువురు ప్రజలు వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సర్పంచి తొడసం లక్ష్మీ, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, డీడీ అంబాజీ, ఈఈ తానాజీ, జీసీసీ డీఎం సందీప్, స్థానిక పంచాయతీ కార్యదర్శి రజనీకాంత్, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story