ఉట్నూర్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ల పర్యటన..

by Kodari Anjali |

గిరిజనుల సంక్షేమ అభివృద్ధికై ఐటీడీఏ పని చేస్తుందని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ తెలిపారు.

ఉట్నూర్‌లో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ల పర్యటన..
X

దిశ, ఉట్నూర్: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కొరకు ఐటీడీఏ పని చేస్తుందని ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మట్ అన్నారు. శుక్రవారం ఐటీడీఏ పీఓ ఛాంబర్ లో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ల బృంద సభ్యులతో పీఓ సమావేశం అయ్యారు. ఐటీడీఏ పరిధిలోని జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు, గిరిజనులకు కల్పిస్తున్న విద్య, వైద్యం, గిరిజనులకు, పివిటీజీలకు అందిస్తున్న సంక్షేమ పథకాల ఫలాలపై వారితో పీఓ ముఖాముఖి చర్చించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధికార యంత్రాంగం సమన్వయంతో సమర్ధవంతంగా అమలు చేస్తూ అర్హులైన గిరిజనులకు పథకాల ఫలాలు అందే విధంగా క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నామని పీఓ పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని అర్హత గల ప్రతి గిరిజనుడికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం రెండు రోజుల క్షేత్ర పర్యటనలో భాగంగా విచ్చేసిన 20 మంది ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ల బృందం ఐటీడీఏ ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్ ఆధ్వర్యంలో హార్టికల్చరల్ లోని ఉద్యాన నర్సరీ, శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ నర్సరీలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అధికారుల బృందానికి హార్టికల్చరల్ ఆఫీసర్ సందీప్ కుమార్ వివరించారు.

బృంద సభ్యులు వివిధ రకాల పంటలకు..

వివిధ రకాల పండ్ల తోటల పెంపకం, సాగు మెలకువలు, అంట్లు కట్టే విధానము, కొమ్మలు కత్తిరించే విధానము, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కూరగాయల నారు పెంపకం, వేసవిలో పండ్లు, కూరగాయల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మొదలైన అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ తమలో ఎక్కువ మంది అధికారులు వ్యవసాయ నేపథ్యం నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిపారు. బృంద సభ్యులు వివిధ రకాల పంటలకు సంబంధించిన పలు ప్రశ్నలను ఆసక్తిగా అడిగి సమాచారాన్ని తెలుసుకున్నారు. అక్కడి నుండి ఉట్నూర్ మండల కేంద్రంలోనీ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో కల్పిస్తున్న వైద్య సేవలు, మందుల నిల్వల వివరాలు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, విద్యా బోధన తీరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు అంశాలను పరిశీలించారు. అధికారుల బృందం సభ్యులు రాకతో వారిని మర్యాదపూర్వకంగా స్వాగతాలు పలికారు. వారి వెంట ఐటీడీఏ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Next Story