నాణ్యత లేని సోలార్ ప్యానెళ్ల బిగింపు

by Naveena |

కరెంట్ లేని గిరిజన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెల్లు, ఇన్వెటర్, బ్యాటరీలు బిగిస్తుంది.

నాణ్యత లేని సోలార్ ప్యానెళ్ల బిగింపు
X

దిశ, ఉట్నూర్: కరెంట్ లేని గిరిజన గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెల్లు, ఇన్వెటర్, బ్యాటరీలు బిగిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం లక్ష్యాన్ని అధికారులు నీరుగారుస్తున్నారు. సొమ్ము కాజేయాలనే ఉద్దేశంతో అధికారులు నాణ్యత లేని సోలార్ ప్యానెల్లు, ఇన్వెటర్, బ్యాటరీలు బిగించారు. దీని కారణంగా సోలార్ లైట్ వెలగని పరిస్థితి నెలకొంది.

ఉట్నూర్ మండలంలోని ధర్మాజీపేట గ్రామానికి కరెంట్ సౌకర్యం లేదు. ఈ గ్రామం 18 కిలో మీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉంది. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు అనేక సార్లు ఐటీడీఏ, జిల్లా అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండాపోయింది. గ్రామం ఏర్పడినప్పటి నుండి గ్రామానికి సూర్య, చంద్రులే దిక్కు అయ్యారు. ఇలా ఒకే గూడెం కాకుండా ఉమ్మడి జిల్లాలోని 32 గ్రామాల్లో కరెంట్ సౌకర్యం లేదు. ఈ ధర్మాజీపేట్ గ్రామంలో 30 ఇండ్లకు సోలార్ లైట్లు ఏర్పాటు చేసినప్పటికి గంట కూడా వెలగడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. లైట్స్ వెలగడం లేదని అధికారులకు చెప్పడానికైన ఫోన్ లో చార్జీంగ్ అవడం లేదని, సోలార్ లైట్స్ సక్రమంగా పని చేయడం లేదని వారు వాపోతున్నారు.

కొలం, తోటి తెగకు చెందిన వారికి బిగింపు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొలం, తోటి గిరిజన ఇండ్లను గుర్తించి సోలార్ లైట్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం సీసీడీపీ పథకం ద్వారా నిధులను మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కరెంట్ లేని గ్రామాలకు ఈ సోలార్ లైట్స్ ఏర్పాటు చేశారు. కరెంట్ లేని గ్రామాలు ౩౨ వరకు ఉన్నాయి. ఈ గ్రామాల్లోని కొలం, తోటి తెగకు చెందిన ఇండ్లకు సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో గ్రామంలో సుమారుగా 68 లక్షలతో గత సెప్టెంబర్ నెలలో సోలార్ లైట్స్ ఏర్పాటు చేశారు.

వేసిన కొద్దిరోజులకే మూలకు...

విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలకు గత ఏడాది సెప్టెంబర్ మాసంలో సీసీడీపీ ద్వారా సోలార్ లైట్లు వేశారు. రెండు సోలార్ ప్యానెల్స్, ఇన్వటర్, రెండు తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీలను బిగించారు. సూర్యరశ్మి ఉంటే లైట్ వెలిగేలా ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ టెండర్ దారులు, అధికారులు కాసుల కక్కుర్తి పడి నాసికమైనవి బిగించారు. దీంతో సోలార్ లైట్లు గంటపాటు కూడా వెలగడం లేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

పట్టించుకోని అధికారులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పీవీటీజీ( గిరిజన తెగల్లో అత్యంత వెనుకబడిన కులస్థులు) వారికి కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమాల కోసం కోట్లాది రూపాయలు విడుదల చేస్తుంది. ముఖ్యంగా కోలాం, తోటి, మన్నేవార్ ల అభివృద్దికి నిధులు కేటాయిస్తున్నప్పటికి క్షేత్ర స్థాయిలో అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో నాసిరకంగా పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నట్లుగా ఆరోపనలు వినిపిస్తున్నాయి.

ఏర్పాటు చేసి వదిలేశారు..

ఉమ్మడి జిల్లాలోని 32 గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేదు. కేంద్ర ప్రభుత్వం సీసీడీపీ పథకం ద్వారా కరెంట్ లేని గ్రామాలకు సోలార్ లైట్లను ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న సమయంలో నాసిరకంగా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అవి ఎక్కడ పని చేయడం లేదు.

- సిడాం గంగాధర్, కోలాం విద్యార్థి సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు

కోలాం, తోటి, మన్నేవార్లకు సీసీడీపీ పథకం ద్వారా సంక్షేమ, అభివృద్ది కోసం నిధులు కేటాయిస్తున్నారు. కానీ కరెంట్ లేని గ్రామాల్లో ఏర్పాటు చేసి సోలర్ లైట్లు సక్రమంగా పని చేయడం లేదు. నిధులను వృథా చేశారు. నాసిరకం పరికాలు అందించిన సంస్థపై చర్యలు తీసుకోవాలి.

- కుంర రాజు, కుంరం సూరు యువసేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు

ఐటీడీఏ పరిధిలో కరెంట్ లేని గిరిజన గ్రామాలకు సోలార్ లైట్లు ఏర్పాటు చేశాం. సోలార్ ఏర్పాటు చేసి ఐదు నెలలకే సక్రమంగా పని చేయడం లేదని నా దృష్టికి రాలేదు. వెంటనే వివరాలు తెలుసుకొని సంబంధిత అధికారులకు మరమ్మతులు చేయడం కోసం తగు చర్యలు తీసుకుంటాం.

మెస్రం మనోహర్, పీవీటీజీ ఏపీఓ ఐటీడీఏ

Next Story