- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్లాస్టిక్ విక్రయాలు ఇష్టారాజ్యం.. ముంచుకొస్తున్న ఆరోగ్య సంక్షోభం
పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నామని చెబుతున్న పాలకుల నిర్లక్ష్యం మూలంగా జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం అమలు కావడం లేదు.

దిశ, మంచిర్యాల: పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నామని చెబుతున్న పాలకుల నిర్లక్ష్యం మూలంగా జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధం అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల మన్నం కలిగిన కవర్లను మాత్రమే వాడాల్సి ఉండగా ఎక్కువ మందం కలిగిన కవర్లను, పాలిథిన్ సంచులు, గ్లాసులు, ప్లేట్లు మార్కెట్లలో లభ్యమవుతున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య సిబ్బంది నిత్యం చెత్త సేకరణలో ఎక్కువ శాతం ప్లాస్టిక్ వ్యర్ధాలే టన్నులకొద్దీ వస్తున్నాయంటే నగరంలో దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ ఉత్పత్తుల విక్రయదారుల వ్యాపారాన్ని యదేచ్చగా సాగిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మాత్రం వ్యాపారులతో కుమ్మక్కవుతున్నారనె ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లోని మార్కెట్ ఏరియా దుకాణ సముదాయాల్లో ని చికెన్ సెంటర్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బజ్జి కోట్లు, కూరగాయల మార్కెట్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్ విక్రయాలు జరుగుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్లాస్టిక్ సంచులను విచ్చలవిడిగా వినియోగించడం వలన ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను డంపింగ్ యార్డులలో తగలబెట్టడం తో వెలువడే విషవాయువులు శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతాయని ఆందోళన చెందుతున్నారు. ప్లాస్టిక్ నిషేధం పై అధికారులు పట్టించుకోకపోవడం, ప్రజలకు అవగాహన కల్పించకపోవడం మూలంగా జిల్లా అంతట ప్లాస్టిక్ వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ ను ఉపయోగించే వారు అనారోగ్యం బారిన పడే ప్రమాదం పొంచి ఉంది.
జిల్లా కేంద్రంలో..
మంచిర్యాల కార్పొరేషన్ గా నూతనంగా ఏర్పడింది. కార్పొరేషన్ లో 60 డివిజన్లు, జిల్లాలోని బెల్లంపల్లి లో 34, లక్షిటిపెట్ లో 15, కేతనపల్లి 22, మందమర్రి, చెన్నూరు18 మున్సిపాలిటీలోని వార్డులలో ప్రతినిత్యం వందల టన్నుల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యర్థాలను ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్‌లలో తగలబెట్టడంతో పట్టణాలలో వాయు కాలుష్యం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ గల్లి లోనైనా ప్లాస్టిక్ కవర్లతో దర్శనమిస్తున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు నామ మాత్రపు తనిఖీలు చేస్తూ వ్యాపారుల నుంచి ఆమ్యామ్యలకు అలవాటు పడి పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో కిరాణా వర్తక షాపుల్లో ప్లాస్టిక్ కవర్ల దందా రూ.కోట్లలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ప్లాస్టిక్ పై పర్యవేక్షణ కరువు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ వినియోగంపై నిషేధం విధించిన క్షేత్రస్థాయిలో అది ఎక్కడ కూడా అమలు కావడం లేదని తెలుస్తోంది. జిల్లా స్థాయిలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం దీనికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు అధికారులు బాహాటంగానే చెప్పుకుంటున్న వారి మాటలు నీటి మూటలుగానే కనిపిస్తున్నాయి. జాతీయ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ చట్టం-2016 ప్రకారం ప్లాస్టిక్ సంచుల వినియోగం నిషేధం అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో జిల్లాలో ప్లాస్టిక్ వినియోగంపై అడ్డుకట్ట వేయలేకపోతున్నారు.
నీటిలో నానదు.. మట్టిలో కరగదు..
ప్రాణాంతకమైన ప్లాస్టిక్ వాడకం వినియోగం డంపింగ్ యార్డ్‌లో కుప్పలు తిప్పలుగా కనిపిస్తుంది. బెల్లంపల్లి పోచమ్మ గడ్డ వద్ద డంపింగ్ యార్డ్ లో ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెడుతున్నారు. పరిసర ప్రాంతం మొత్తంగా పొగ వ్యాపించి దుర్వాసన వెదజల్లుతోంది. పక్కనే ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయానికి, స్మశాన వాటికకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యానికే కాకుండా జీవరాశి మనుగడకు ఈ ప్లాస్టిక్ ప్రమాదంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో పడేసిన ప్లాస్టిక్ కవర్లు నీటిలో నాన కుండా మట్టిలో కరగ కుండ ఏళ్లపాటు ఉండడం మూలంగా భూసారం దెబ్బతినే ప్రమాదకర సాంకేతాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ప్లాస్టిక్ మహమ్మారిని కట్టడి చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికైనా దృష్టి సాధించాలని ప్రజలు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం:బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్
బెల్లంపల్లి పట్టణంలో ప్లాస్టిక్ కవర్ విక్రయదారుల పై నిఘా ఉంచినట్లు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ సంపత్ తెలిపారు. ప్రతి సంవత్సరం ప్లాస్టిక్ వర్తక వ్యాపారులతో ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే షాపులపై నోటీసులతో పాటు సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.






