- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాగజ్ నగర్ లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రణరంగం
కాగజ్‌నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు రాజకీయ సెగను రేపాయి. సామాన్యుడికి ఒక న్యాయం.. బీఆర్ఎస్ నేతలకు ఒక న్యాయమా..? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

దిశ, కాగజ్ నగర్ : కాగజ్‌నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు రాజకీయ సెగను రేపాయి. సామాన్యుడికి ఒక న్యాయం.. బీఆర్ఎస్ నేతలకు ఒక న్యాయమా..? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ శ్రేణులు గర్జించడంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతం ఒక్కసారిగా అట్టుడికింది. అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకుల తీరు పై నిరసనలు మిన్నంటాయి. పట్టణ సుందరీకరణలో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి పక్కన అధికారులు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. తమకు అనుకూలంగా ఉన్న చోట ఒకలా, ఇతరుల వద్ద మరోలా వ్యవహరిస్తున్నారని ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య పరస్పర దూషణలు, తోపులాటకు దారితీసింది. రోడ్డు విస్తరణలో అందరికీ సమాన న్యాయం ఉండాలని, అధికార అండతో పనులను అడ్డుకోవడం అన్యాయమని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.
వాగ్వాదం సమయంలో బీఆర్ఎస్ నాయకులు హద్దులు దాటి ప్రవర్తించారని, దళిత సామాజిక వర్గానికి చెందిన వారిని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు ప్రధాన రహదారిపై బైఠాయించారు. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలో దిగిన పోలీసులు చేరుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేసినప్పటికీ, లోలోపల ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. రోడ్డు వెడల్పు అయితే పట్టణానికే మంచిది. ఇలాంటి పనుల్లో రాజకీయ రంగు పులుముకుని గొడవలు చేయడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది అని, అభివృద్ధికి అడ్డుపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అధికారులు పనులు పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






