పసివాడిని పగబట్టిన మాయ రోగం.. సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

by Jakkula.Mamatha |

చిన్న కుటుంబం. చింతలేని కుటుంబం అంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది.

పసివాడిని పగబట్టిన మాయ రోగం.. సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
X

దిశ, మందమర్రి: చిన్న కుటుంబం. చింతలేని కుటుంబం అంటారు. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయింది. ఆ కుటుంబ ప్రాబ్లమ్స్ పగబట్టిన విధంగా ఉండే సరికి ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఉన్నంతలో సర్దుకుంటూ తమ పిల్లలను ప్రయోజకులను చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకున్నారు. ఈ క్రమంలో ఎదురైన ఒక్కో కష్టాన్ని దాటుకుంటూ ముందుకు సాగారు. అయినా కూడా ఆ దేవుడు వారిపై దయ చూపలేదు. బడికి వెళ్లి చదువుకుంటూ.. తోటి పిల్లలతో ఆడుకునే వయసులో మాయరోగం వెంటాడింది. ఫలితంగా ఒక్కసారిగా ఆ కుటుంబం అప్పుల ఊబిలో చిక్కుకుని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న మానవీయ కథనం.

మందమర్రి రెండో జోన్ లో నివాసం ఉంటున్న వేనవంక నారాయణ- శ్రీలత దంపతులకు కూతురు మనస్విత, కొడుకు రిషికేశ్వర్ సంతానం. ఈ దంపతులు ప్రైవేట్ ఉపాధ్యాయులుగా పని చేస్తూ తమ పిల్లలకు ఏ లోటు రాకుండా మంచిగా చూసుకుంటున్నారు. కొడుకు రిషికేశ్వర్ మందమర్రి మాంటిస్సోరి పాఠశాలలో 4వ తరగతి, కూతురు మనస్విత మోడల్ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేశారు. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే రిషికేశ్వర్ తల్లిదండ్రులు, తోటి వారి పట్ల బాధ్యతగా, మంచిగా ఉండేవారు.

పసివాడిని పగబట్టిన మాయ రోగం..

నాలుగు నెలల క్రితం రిషికేశ్వర్ తోటి పిల్లలతో ఆడుకుంటూ ఒక్కసారిగా అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్ ఆసుపత్రుల్లో హైదరాబాద్ చూపించిన నయం కాలేదు. దీంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయగా క్యాన్సర్(బ్లడ్ క్యాన్సర్, ఏఎంఎల్)గా వైద్యులు నిర్ధారించడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులకు గుండె ఆగినంత పని అయింది. అభం శుభం తెలియని ఈ వయసులో కొడుకు ప్రాణాంతకమైన జబ్బు రావడం ఏంటి దేవుడా అని నిద్రలేని రాత్రులు గడిపారు. షాక్ నుంచి కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. ఆడిపాడే వయస్సులో కొడుకు దయనీయ పరిస్థితి చూసి మౌనంగా రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది.

వైద్య ఖర్చులకు దాతల సాయం కోసం ఎదురుచూపు..

పదేళ్ల వయసు ఉన్న కొడుకును కాపాడుకునేందుకు ఆ తల్లిదండ్రులు ఎక్కని గడప లేదు. మొక్కని దేవుడు లేదంటే అతిశయోక్తి కాదు. దొరికిన చోటల్లా స్తోమతకు మించి రూ. 35 లక్షలు అప్పు చేసి నాలుగు నెలలుగా కొడుకు వైద్యం చేయిస్తున్నారు. తమ్ముడిని రక్షించుకునేందుకు అక్క మనస్విత సైతం తన బోన్ మ్యార్ ఇచ్చిందంటే ఆ కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పూర్తి వైద్యం అందించి బాబు బ్రతికి బయటకు రావాలంటే మరో రూ.20 లక్షల అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే అప్పు కోసం తిరిగి తిరిగి మానసికంగా , శారీరకంగా అలసిపోయిన తల్లిదండ్రులు ఎవరైనా దాతలు వచ్చి అదుకోబోతారా అని దయనీయ స్థితిలో ఎదురు చూస్తున్నారు.

మూడేళ్ల క్రితం అగ్ని ప్రమాదం..

మూడేళ్ల క్రితం వీరి కుటుంబ సభ్యులందరు బయటకు వెళ్లగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇళ్లు పూర్తిగా దగ్ధం అయింది. ఇంట్లో ఉన్న సామగ్రి, వస్తువులు కాలిపోగా రూ.10 లక్షల నష్టం వాటిళ్లి కుటుంబం రోడ్డున పడింది. ఈ సంఘటన నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఇప్పుడు ఈ దుస్థితి రావడంతో వీరి కుటుంబం కన్నీటి పర్యంతం అవుతున్నారు. మనసున్న దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. దాతలు ఎవరైనా రిషికేశ్వర్ కు వైద్యం కోసం డబ్బులు ఇవ్వాలనుకుంటే గూగుల్ పే, ఫోన్ పే నెంబర్: 9949156031 (వేనవంక నారాయణ శ్రీలత)కు పంపించాలని వేడుకుంటున్నారు.

Next Story