మట్టి మాఫియాపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు

by Kodari Anjali |

అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా కొమురం భీం జిల్లా మారుతోంది.

మట్టి మాఫియాపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు
X

దిశ, కాగజ్‌నగర్: అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా కొమురం భీం జిల్లా మారుతోంది. ముఖ్యంగా కాగజ్‌నగర్ మండలంలో భూ దోపిడీ పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ భూములను గుట్టలను మింగేస్తున్న ఈ మృగాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అన్న మాటను ఈ మైనింగ్ మాఫియా అక్షరాలా నిజం చేస్తోంది. కళ్లముందే ప్రకృతి సంపద కరిగిపోతున్నా అధికారులు మాత్రం మౌనంగా ఉండటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి అధికారులకే తెలియాలి. మండలంలోని చింతగూడ, కోయవాగు, బలగాల, గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో అక్రమ మైనింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రోజు జేసీబీలు, పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ప్రభుత్వ భూమిని తవ్వేస్తూ స్వేచ్చగా తరలిస్తున్నారు. మండలంలో ఈ మాఫియా ఒక్క చోటే కాకుండా చారిగాం పరిసరాల్లోని ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు కొండలను కూడా వదలకుండా కొల్లగొడుతున్నారు. దీని వెనుక కొందరు రాజకీయ నాయకుల హస్తం ఉండటంతో అధికారులు కనీసం ఆ ఖద్దరు చొక్కాల వైపు చూడటానికి కూడా సాహసించడం లేదు.

మైనింగ్ జరుపుతున్న తీరు చూస్తుంటే..

అసలు తప్పును ఎత్తిచూపాల్సిన వారే తెల్లమొహం వేసుకుని తమాషా చూస్తుండటం తప్ప చేసేది ఏమీ లేదు. అక్రమాలను ప్రశ్నిస్తే అణచివేస్తామనే ధోరణి ఇక్కడ రాజ్యమేలుతోంది గతంలో ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన ఒక సీనియర్ విలేకరిపై భౌతిక దాడికి దిగడం ఈ మాఫియా బరితెగింపునకు నిదర్శనం. నిజాయితీగా పని చేసే గొంతుకలను నొక్కేస్తూ కాగజ్‌నగర్‌ను అక్రమాలకు అడ్డాగా మార్చేశారు. అసలు ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి కానీ ఇక్కడ కొందరు స్వార్థపరులు ప్రభుత్వ స్థలాలను తమ సొంత ఆస్తిలా ఇష్టారాజ్యంగా మైనింగ్ జరుపుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో గుట్టలు ఉండవు సరే కదా కనీసం భూమి కూడా మిగిలేలా లేదు. ఎక్కడ తవ్వినా అక్రమాల పుట్టలు బయటపడుతున్నా జిల్లా యంత్రాంగం నిద్రపోతోందా లేక నిద్ర నటిస్తోందా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టాలంటే తూతూ మంత్రపు తనిఖీలు కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రకృతి సంపదను దోచుకుంటున్న బకాసురులను కటకటాల్లోకి నెట్టాలి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మైనింగ్ అధికారులు స్పందించి ఈ అక్రమ మైనింగ్ నీ అరికట్టాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story