- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్కడ పచ్చదనం.. ఇక్కడ అధ్వానం !
కుబీర్ మండలంలోని నర్సరీల నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

కుబీర్ మండలంలోని నర్సరీల నిర్వహణలో అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బెల్గాంతండా నర్సరీ పచ్చదనంతో కళకళలాడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. బెల్గాం గ్రామంలోని నర్సరీ పై కోతులు దాడులు చేస్తూ మొలకలను ధ్వంసం చేస్తున్నాయి. మాలేగాం గ్రామంలో మాత్రం మొలకలు రాకముందే మట్టి కవర్లు పాడైపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. క్షేత్రస్థాయిలో నర్సరీలను పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు మండిపడుతున్నారు. నర్సరీ కూలీలకు నెలల తరబడి ఉపాధి హామీ వేతనాలు అందడం లేదని కూలీల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నర్సరీలను అభివృద్ధి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.
దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని నర్సరీల నిర్వహణ ఒక్కో చోట ఒక్కో తీరుగా కనిపిస్తూ వింత పరిస్థితిని తలపిస్తోంది. కొన్ని చోట్ల మొక్కలు పచ్చదనంతో కళకళలాడుతుంటే, మరికొన్ని చోట్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల మొలకెత్తకముందే పాడైపోతున్నాయి. బెల్గాంతండాలోని నర్సరీలో గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసి మొక్కలను పద్ధతిగా సంరక్షిస్తుండడంతో అది చూపరులను ఆకట్టుకుంటోంది. అయితే, బెల్గాం గ్రామంలోని నర్సరీలో మాత్రం కోతుల బెడద తీవ్రంగా ఉంది. మొలకెత్తిన చిన్న చిన్న మొక్కలను కోతులు పీకి పారేస్తుండడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మాలేగాం గ్రామంలోని నర్సరీ పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. అక్కడ విత్తనాలు మొలకెత్తకముందే మట్టి నింపిన కవర్లు పాడైపోతుండడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతోంది.
కూలీల ఆకలి కేకలు...
నర్సరీల్లో కష్టపడి పనిచేసిన ఉపాధి హామీ (ఈజీఎస్) కూలీలకు నెలలు గడుస్తున్నా వేతనాలు అందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎండనక వాననక పనిచేశామని, ఇప్పటివరకు ఒక్క పైసా రాలేదని పలువురు కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీ డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వారు వాపోతున్నారు.
అధికారులు స్పందించాలి..
మండలంలోని నర్సరీల నిర్వహణపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాలేగాం వంటి చోట్ల వృథా అవుతున్న నిధులను అరికట్టాలని, అలాగే కోతుల బెడద నుంచి మొక్కలను రక్షించేందుకు రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేతనాలు రాని కూలీలకు వెంటనే డబ్బులు అందజేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






