పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్

by Jakkula.Mamatha |

పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: మంత్రి పొన్నం ప్రభాకర్
X

దిశ, కొండపాక: పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలోని అర్బన్ ఆక్సిజన్ పార్క్‌లో సిద్దిపేట అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మొక్కలు నాటడమే కాకుండా, ‘చెట్టు విలువ తెలుసా’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించి, అందరితో పర్యావరణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీ తరహా కాలుష్య దుస్థితి తెలంగాణకు రాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో సున్నా టాక్స్‌తో ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీని తీసుకువచ్చారని తెలిపారు. మొక్కలు నాటడం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, అందరి జీవితాల్లో భాగం కావాలన్నారు.

రాష్ట్రంలో నిర్మించే 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లలో, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో మొక్కల పెంపకం పర్యవేక్షణకు ఐదుగురు సభ్యుల కమిటీలను వేశామని, కోతుల సమస్య నివారణకు పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉత్తమంగా మొక్కలు నాటిన గ్రామాల సర్పంచులను అభినందిస్తామని, పర్యావరణం, స్వచ్ఛత కోసం మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులు, హోటళ్లకు గ్లాసులు పంపిణీ చేశామని తెలిపారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ అవార్డు అందుకోవడం గర్వకారణమన్న మంత్రి, అందరూ ‘ప్రకృతి రక్షకులుగా’ మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ హైమావతి, సీపీ రష్మీ పెరుమాళ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం తదితరులు పాల్గొన్నారు.

Next Story