టికెట్ల కోసం ఆశావహుల వేట.. అధికార పార్టీకి డిమాండ్

by Naga Rani Yarlagadda |

పురపాలక సంఘంలో ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కాకముందే టికెట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి.

టికెట్ల కోసం ఆశావహుల వేట.. అధికార పార్టీకి డిమాండ్
X

దిశ, నిర్మల్ ప్రతినిధి : పురపాలక సంఘంలో ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కాకముందే టికెట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారన్న విస్తృత ప్రచారం మేరకు ఆశావాహ అభ్యర్థులు టికెట్ల వేటలో పడ్డారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జిల నివాసాలు టికెట్లు ఆశిస్తున్న నాయకులు వారి అనుచరులతో కిటకిటలాడుతున్నాయి. తనకు టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి వస్తానంటూ టికెట్లు ఇచ్చే నేతలకు భరోసా కల్పిస్తున్నారు. తమ వెంట చోటామోటా నేతలు సహా కుల సంఘాలు, కాలనీ పెద్దమనుషులను వెంటబెట్టుకొని పార్టీ టికెట్లు ఇచ్చే నేతలపై ఒత్తిడి పెంచుతున్నారు.

రిజర్వేషన్లు ఖరారు కాకముందే

పురపాలక సంఘాల ఎన్నికలకు సంబంధించి ఆయా మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్లు ఇప్పటికీ ఖరారు కాలేదు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వలేదు. రిజర్వేషన్లు ప్రక్రియ చివరి దశలో ఉండగానే ఆశావహ అభ్యర్థులు తమకు రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందన్న ఆశతో టికెట్ల కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎలా ఉన్నప్పటికీ... ముందస్తుగా దస్తి వేసుకున్నట్లు ఏ రకమైన రిజర్వేషన్ వచ్చిన తనకు లేదా తన భార్యకు టికెట్ ఇవ్వాలన్న కోణంలో ప్రయత్నాలు చేస్తుండడం సర్వత్ర చర్చకు దారి తీస్తున్నది. మరోవైపు మున్సిపల్ చైర్మన్ పదవులు సైతం ఏ రిజర్వేషన్ వస్తుందో తేలలేదు. అయితే గతంలో ఉన్న రిజర్వేషన్లు మళ్ళీ అలాగే కొనసాగుతాయన్న అభిప్రాయంతో చైర్మన్ అభ్యర్థులు వార్డు అభ్యర్థులు టికెట్ల కోసం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికార పార్టీ టికెట్ల కోసం పోటీ తీవ్రం

అధికార కాంగ్రెస్ పార్టీ తరపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎక్కువగా అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఆలోచనతో అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. నిర్మల్ ఆదిలాబాద్ కాగజ్ నగర్ బైంసా పురపాలక సంఘాల్లో బిజెపి తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నాలుగు చోట్ల బిజెపి శాసనసభ్యులు ఉండడం కారణంగా అభ్యర్థులు ఎక్కువగా పోటీకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, క్యాతన్ పల్లి, నస్పూర్, ఖానాపూర్ తదితర మున్సిపాలిటీలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలన్న ఆసక్తితో చైర్మన్ అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Next Story