Municipal Elections:ఓటేద్దాం.. పదండి..!

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-11 02:36:16  IST  )

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

Municipal Elections:ఓటేద్దాం.. పదండి..!
X

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజులుగా రాజకీయ పార్టీలు నిర్వహించిన హోరాహోరీ ప్రచారం ముగియడంతో, ఇప్పుడు బంతి ఓటర్ల కోర్టులోకి చేరింది. సుమారు 1600 మంది అభ్యర్థుల భవితవ్యం బుధవారం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. శాంతిభద్రతల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

దిశ, నిర్మల్ ప్రతినిధి/ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. బుధవారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ సామాగ్రి తో ఎన్నికల అధికారులు, సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. పంపిణీ ప్రక్రియను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకుంది. రాజకీయ పార్టీలలోనూ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సుమారు వారం రోజుల పాటు ముమ్మరంగా చేసిన ప్రచారం ఎంత వరకు ఫలించింది. ఓటర్లు ఎవరికి అనుకూలంగా వ్యవహారిస్తారోనని ఆందోళన చెందుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ సర్వేలు చేయించగా.. చివరి రోజున ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

ఉమ్మడి జిల్లాలో 6.71లక్షల ఓటర్లు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 మున్సిపాలిటీలు ఉండగా వీటి పరిధిలో 6.71లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3.28లక్షల మంది పురుషుల ఓట్లు ఉండగా.. మహిళలు 3.42లక్షల మంది ఉన్నారు. ఇందులో 2.14లక్షల మంది యువత ఓటర్లు ఉన్నారు. కాగా ఉమ్మడి జిల్లాలోని 328 వార్డులు ఉండగా వీటిలో 1600 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాగా తాజాగా ఉమ్మడి జిల్లాలో పోలింగ్ శాతంపై పార్టీల్లో ఆందోళన కనిపిస్తుంది. పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం వారం రోజుల పాటు విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. గతంలో పల్లెల కంటే పట్టణ ఓటింగ్ శాతం తగ్గిపోవడంతో అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సారి పోలింగ్ శాతం భారీగా పెంచేందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేశారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.

అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్..

మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం నిర్వహించాయి. ఎవరికి వారు గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. ఓటరు నాడి పై సొంతంగా సర్వేలు సైతం చేయించారు. కాని కొన్ని సందర్భాల్లో అంతుచిక్కని ఓటరు నాడి ఎవరికి అనుకూలంగా మారుతుంది.. ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.

ఓటరుకు ఓటు పండగ..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లకు నోటు పండగ కనిపిస్తున్నది. అందిస్తే అందుకున్నంత అన్నట్లుగా ఆయా పురపాలక సంఘాల్లో పెద్ద మొత్తంలో నోట్ల పంపిణీ జరుగుతున్న సంకేతాలు వచ్చాయి ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కోరకంగా అన్నట్లుగా ఓటరుకు 1000 నుంచి 5000 దాకా నోట్లో పంపిణీ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. నిర్మల్, మంచిర్యాల లో అన్నిటితో పోలిస్తే పెద్ద మొత్తంలో నగదు పంపిణీ జరిగినట్లు ప్రచారం జరుగుతున్నది. మిగతా స్థానాల్లో వెయ్యి నుంచి రెండు వేల వరకు ఒక్కో ఓటరుకు పంచినట్లు తెలిసింది. నగదు పంపిణీతో పాటు మద్యం, మందు అదనంగా పంపిణీ చేశారని సమాచారం.

తెలంగాణ ‘మున్సిపల్’ పోరు.. పటిష్ట భద్రత మధ్య ప్రారంభమైన పోలింగ్

Next Story