వామ్మో.. ఇదేం ఖర్చు..!

by Ajay Maddhiboyina |

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నోటుకు ఓటు భారీ ప్రకంపనలు సృష్టిస్తున్నది. అన్ని పార్టీల మద్దతు దారులు ఇంటింటికి వచ్చి ప్రతి ఓటుకు...

వామ్మో.. ఇదేం ఖర్చు..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నోటుకు ఓటు భారీ ప్రకంపనలు సృష్టిస్తున్నది. అన్ని పార్టీల మద్దతు దారులు ఇంటింటికి వచ్చి ప్రతి ఓటుకు... 1000, 1500, 2000, 3000... ఇలా ఒక్కో అభ్యర్థి ఒక్కోరకంగా డబ్బులు పంచుతున్న తీరు ఓటర్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నది. అసలు తమ గ్రామంలో జరుగుతున్న ఎలక్షన్ ఎమ్మెల్యేలదా ... ఎంపీలదా అన్నట్లుగా అనుమానం కలుగుతుందని గ్రామీణ ఓటర్లు ఆశ్చర్యపోతున్నారు.

నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ గ్రామంలో ఆరుగురు అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం పోటీపడ్డారు. వీరిలో ఒక అభ్యర్థి ప్రతి ఓటరుకు 1500... ఇంకో అభ్యర్థి 2000... మరో అభ్యర్థి 3000 చొప్పున పంపిణీ చేశారు. ఈ లెక్కన ప్రతి ఓటరుకు ఆరున్నర వేల చొప్పున నగదు అందింది. ఈ నగదుకు మద్యం, మాంసం అదనంగా అందించినట్లు చెబుతున్నారు. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లు ఉంటే... సగటున ఆ కుటుంబానికి ఈసారి జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 26 వేల రూపాయలు నగదు రూపంలో వెళ్ళింది. ఇక వారం రోజులపాటు మద్యం రూపంలో మరో ఆరువేల రూపాయల దాకా ఓటర్ల కుటుంబాలకు చేరింది. చివరి రోజున మాంసం పంపిణీ చేశారు. అయినప్పటికీ ఆ గ్రామంలో డబ్బులు భారీగా పంపిణీ చేసిన ఆ ముగ్గురిని గ్రామస్తులు తిరస్కరించారు. కేవలం ఎన్నికల ప్రచారం రూపంలో చిన్న మొత్తంలో మాత్రమే ఖర్చు చేసిన అభ్యర్థిని ఆ గ్రామస్తులు గెలిపించారు. ఇక్కడ కుల ప్రభావం గట్టిగా పని చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దిలావర్పూర్ మండల కేంద్రంలో ముగ్గురు అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడ్డారు. ఒక అభ్యర్థి ప్రతి ఓటుకు 5000 పంపిణీ చేయగా... మరో అభ్యర్థి వెయ్యి రూపాయలు... ఇంకో అభ్యర్థి తమకు ప్రతికూలంగా ఓట్లు వస్తాయనుకున్న కొన్ని సామాజిక వర్గాలకు ఓటుకు 2000 చొప్పున పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ గ్రామంలో కూడా కులం ప్రభావం బలంగా పనిచేస్తుందని విశ్లేషిస్తున్నారు.

నిర్మల్ గ్రామీణ మండలం చిట్యాల గ్రామంలో రేపు ఎన్నికలు అనగా ఒక అభ్యర్థి ఓటుకు 1500 పంపిణీ చేస్తే మరో వ్యక్తి అదను చూసి 2000 రూపాయలు ప్రతి ఓటరుకు ముట్ట చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు కాగా... సొంత కులంలోనే రెండు వర్గాలు విడిపోయి ఓటర్లను ప్రభావితం చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు...

ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓట్ల కోసం జరుగుతున్న నోట్ల జాతర బలహీనంగా ఉండే ఆశావహ అభ్యర్థులకు గండంగా మారుతున్నది. ప్రజాస్వామ్యంలో పోటీ చేసే హక్కును ఇలా.. డబ్బు రూపంలో హరింప చేస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్న అభ్యర్థులు విపరీతంగా డబ్బులు పంచుతుండడంతో రాజకీయ ఆసక్తితో పదవుల కోసం పోటీపడుతున్న వారు కనీసం ఎన్నికల పోటీలో నిలబడే పరిస్థితిని కోల్పోతున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఎన్ని డబ్బులు పంచినా... కుల పరమైన పరిణామాలు అభ్యర్థులకు కలిసి వస్తున్నాయి.

అప్పుల ఊబిలోకి...

సర్పంచ్ ఎన్నికల ప్రభావం ఎన్నికల్లో పోటీ చేస్తున్న, చేసిన అభ్యర్థులను తీవ్రమైన అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేస్తున్నాయి. రాజకీయంగా నిలదిక్కూ కోవడంతోపాటు, పరువు ప్రతిష్ట కోసం గ్రామాల్లో ఎన్నికలను సవాలుగా తీసుకున్న అనేకమంది అభ్యర్థులు అప్పులు చేసి ఎన్నికలకు వెళ్లారు. ఇలా అనేకమంది తీవ్రమైన అప్పుల ఊబిలోకి దిగిపోయారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో వారి కుటుంబాల పై ఎలాంటి ప్రభావం చూపుతాయోనన్న అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్ర చర్చకు దారి తీస్తున్నాయి.

Next Story