- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.. ఉత్తర్వులు జారీ
దిశ ప్రతినిధి, నిర్మల్ : మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ ప్రతినిధి, నిర్మల్ : మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో ఉన్న ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. కేబినెట్ హోదా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు ఇచ్చినప్పటికీ పదవి చేపట్టేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
పార్టీకి చేసిన సేవలను గుర్తించి...
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు విశేష సేవలు అందించారు. ఆయనకు రేవంత్ ప్రభుత్వంలో కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని తొలినుంచి ప్రచారం జరిగింది. అయితే అనేక రాజకీయ సమీకరణలు, సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు దీంతో ఆయన అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అనేకసార్లు తాడోపేడో తేల్చుకుంటానంటూ బాంబులు పేల్చారు. ఒక దశలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసి తన అంతరంగాన్ని చెప్పుకున్నారు. అయినప్పటికీ పదవి దక్కలేదు. 2000 సంవత్సరంలో పిసిసి సభ్యుడిగా ఆసిఫాబాద్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన ప్రేమ్ సాగర్ రావు అంచలంచలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ గా పని చేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా గెలుపొందారు. అప్పుడే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగారు. రెండు పర్యాయాలు భారత్ రాష్ట్ర సమితి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సమయంలోను ఆయన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారు. కష్ట కాలంలో పార్టీకి పెద్దదిక్కుగా నిలిచారు. దాదాపుగా ఉమ్మడి జిల్లాలోని నేతలందరూ వివిధ రాజకీయ పార్టీల్లో చేరినప్పటికీ ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి తొలి సమావేశం ఇంద్రవెల్లిలో నిర్వహించగా.. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ప్రేమ్ సాగర్ రావు భుజస్కందాలపై వేసుకున్నారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎల్పీ నేత హోదాలో చేపట్టిన ప్రజాహిత పాదయాత్ర కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయనే స్వయంగా ముందుండి నడిపారు. 2018లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చూసి ఓడిపోగా..2023 లో మంచిర్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన భార్య సురేఖ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
ఇటీవలనే సీఎం పరామర్శ... ఆ క్రమంలోనే కార్పొరేషన్ చైర్మన్...
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగానే క్యాబినెట్ హోదా కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తాజాగా రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. దీంతో ప్రేమ్ సాగర్ రావు వర్గీయులలో హర్షం వ్యక్తం అవుతున్నది. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఆయన కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగా ప్రేమ్ సాగర్ రావు ఇంకా కోయంబత్తూర్ లో ఉన్న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.






