హైద‌రాబాద్ లో మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల మాఫియా..భ‌యాందోళ‌న‌లో గ‌ల్ఫ్ ప్ర‌యాణికులు..!

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-07 09:17:57  IST  )

హైద‌రాబాద్ లో మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల మాఫియా..భ‌యాందోళ‌న‌లో గ‌ల్ఫ్ ప్ర‌యాణికులు..!
X

దిశ‌, లోకేశ్వ‌రం : ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే పలువురు డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వాహకులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకున్నా అన్ ఫిట్ చేస్తూ అక్రమ వ్యాపారానికి తెరలేపి అమాయకులను దోచుకుంటున్నారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లేవారు ఏజెంట్ల వద్ద డబ్బులు చెల్లించగానే వారు సూచించిన డయాగ్నస్టిక్ సెంటర్లలో మాత్రమే ఆరోగ్య పరీక్షలు చేయించుకొని ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకువస్తే వీసా ఇస్తామని చెబుతారు. వేరే డయాగ్నస్టిక్ సెంటర్ ల నుంచి తీసుకువచ్చినా ఫిట్ నెస్ సర్టిఫికెట్ల తో గల్ఫ్ దేశాలకు వెళ్లిన తర్వాత కంపెనీవారు అక్కడ మళ్ళీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అన్ ఫిట్ చేసి తిప్పి పంపే ఆస్కారం ఉందని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇక్కడే అక్రమాలకు పాల్ప‌డుతున్నారు.

నిత్యం 30 నుంచి 40 మందికి ప‌రీక్ష‌లు

ప్రతిరోజు 30 నుంచి 40 మందికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు. వైద్య పరీక్షలకు వారు సూచించిన డయాగ్నస్టిక్ సెంటర్ లకు మాత్రమే పంపుతారు. అందులో నుంచి కేవలం నలుగురు లేదా ఐదుగురికి మాత్రమే ఫిట్ నెస్ సర్టిఫికెట్లు జారీ చేసి.. మిగతా వారికి వివిధ కారణాలు చూపుతూ అన్ ఫిట్ చేసి మళ్లీ వారం పది రోజుల తర్వాత రావాలని తిప్పి పంపుతున్నట్లు సమాచారం. రెండోసారి ఆరోగ్య పరీక్షలకు వెళ్లిన వారి వద్ద కన్సెషన్ సాకుతో బేరమాడి అదనంగా ఐదారు రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఎలాంటి ర‌సీదు ఉండవు..

వైద్య పరీక్షల కోసం ఒక్కొక్కరి వద్ద రూ.8500 వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కొక్క డయాగ్నస్టిక్ సెంటర్లో నిత్యం రూ.3 నుంచి 4 లక్షల వరకు అక్రమ వ్యాపారం కొనసాగుతోంది. కాగా వారు వసూలు చేసిన డబ్బులకు ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని తెలిసింది. ప్రభుత్వానికి జీఎస్టీ ఎగవేయాలని ఉద్దేశంతో ఆన్లైన్ పేమెంట్లకు వారు అంగీకరించడం లేదు.

త‌ప్పుడు స‌ర్టిఫికెట్ల‌తో భ‌య‌బ్రాంతుల‌ు..

కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక పాతికేళ్ల యువకుడు ఇటీవల ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఏజెంట్ కు డబ్బులు చెల్లించగా.. ఆయన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ లో గల ఒక డయాగ్నస్టిక్ సెంటర్ కు వెళ్లాలని సూచించాడు. దీంతో ఆ యువకుడు అక్కడికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్లు డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఎలాంటి చెడు అలవాట్లు లేని ఆ యువకుడు భయాందోళన గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడగా.. మిత్రులు అతనికి నచ్చజెప్పి కరీంనగర్ పట్టణంలోని ప్రముఖ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా ఎలాంటి వ్యాధులు లేవని యువకుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు సర్టిఫికెట్ జారీ చేసినట్టు స‌మాచారం. దీంతో వారు తప్పుడు నివేదికలు ఇచ్చిన హైదరాబాద్ లోని డయోగ్నస్టిక్ సెంటర్ కి వెళ్లి నిలదీయగా వారు బెదిరించి పంపినట్లు సమాచారం. ఏది ఏమైనా అమాయకుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న డయాగ్నస్టిక్ సెంటర్ల పై సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్ల మోసాల‌ను అరిక‌ట్టాలి : కేవైసీఎస్ గ‌ల్ఫ్ దేశాల వ్య‌వ‌స్థాప‌కులు పెద్ది ర‌వికుమార్

ఉన్న ఊరును క‌న్న‌వారిని, ఆర్థిక ఇబ్బందుల‌ను దూరం చేయాల‌నే ఉద్దేశంతో గ‌ల్ఫ్ దేశాల‌కు వెళ్లాల‌నే ఉత్సాహంతో ఉన్న వారి అమాయ‌క‌త్వాన్ని ఆస‌రా చేసుకొని దోచుకుంటున్న డ‌యాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహ‌కుల దోపీడీని అరిక‌ట్టాలి. కొంత మంది ఏజెంట్లు వారితో కుమ్మ‌క్కై అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు. గ‌ల్ఫ్ దేశాల‌కు వ‌చ్చేవారు అలాంటి వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Next Story