కళాశాల భవనం పై నుండి దూకి.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

by Bhanu |

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో భవనం పై నుండి దూకి గురువారం ఆత్యహత్యా యత్నానికి పాల్పడిన డిగ్రీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.

కళాశాల భవనం పై నుండి దూకి.. డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
X


దిశ, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో భవనం పై నుండి దూకి గురువారం ఆత్యహత్యా యత్నానికి పాల్పడిన డిగ్రీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. మరికొన్ని రోజుల్లో విద్యా సంవత్సరం ముగుస్తుండగా.. ఈ ఘటన సంభవించడం తల్లిదండ్రులను తీవ్ర విషాదానికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జంగపల్లి లక్ష్మి ప్రసన్న(20) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం లక్ష్మి ప్రసన్న అదే కళాశాల భవనం పై నుండి దూకింది. గమనించిన హాస్టల్ సిబ్బంది రక్తపు మడుగులో కూరుకుపోయిన లక్ష్మి ప్రసన్నను చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయారు.

సిబ్బంది దూషణతోనే మనస్తాపం...

డిగ్రీ విద్యార్థిని లక్ష్మి ప్రసన్న కళాశాల సిబ్బంది దూషించడంతోనే మనస్తాపానికి గురై ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బుధవారం రాత్రి కళాశాల సిబ్బంది విద్యార్థినులను తీవ్రంగా దుర్భాష లాడినట్లు తెలియ వచ్చింది. ఈ క్రమంలోనే లక్ష్మి ప్రసన్న మనస్తాపం చెంది ఉంటుందని తెలుస్తోంది. తోటి విద్యార్థులతో అప్పటి దాకా కలివిడిగానే ఉన్న ఆమె ఉన్నట్టుండి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనం రేపింది. కాగా భీమిని మండలం జగ్గయ్య పేట గ్రామంలో ఉంటున్న లక్ష్మీ ప్రసన్న తండ్రి గోపాల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. విద్యార్థిని లక్ష్మి ప్రసన్న భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలిస్తుండగా విద్యార్థి సంఘాల నాయకులకు, పోలీసులుకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

క్రిమినల్ కేసుకు పీడీఎస్ యూ డిమాండ్

విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న మృతికి కారణమైన సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వాచ్ మెన్, సిబ్బంది పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘమైన పీడీఎస్ యూ డిమాండ్ చేసింది. ఈ ఘటన పై జిల్లా కలెక్టర్ తో విచారణ జరిపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వెళదామంటే కళాశాల లోపలికి అనుమతులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన వాపోయారు. అయితే విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాత్రం 'మీ అమ్మాయి బాత్రూంలో పడింది.. ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చాం' అని చెప్పడం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. బాత్రూంలో పడితే చనిపోయేంత పరిస్థితి ఎందుకు ఉంటుందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంత జరిగిన కూడా సంబంధిత అధికారులు ఆర్ సి, జోనల్ అధికారి, కలెక్టర్ ఇప్పటివరకు స్పందించకపోవడం చాలా బాధాకరమని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దీనిపై విచారణ జరిపి సంబంధిత కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, మృతురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాలని పీడీఎస్ యూ ప్రగతిశీల తరఫున ఆయన డిమాండ్ చేశారు.

Next Story