‘మంచిర్యాల మెడికల్ కాలేజీ మా హయాంలోనే మంజూరైంది’: కేటీఆర్

by Kodari Anjali |

అభివృద్ధి, సంక్షేమం కావాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని మంచిర్యాల జిల్లా పర్యటనలో కేటీఆర్ చెప్పుకొచ్చారు.

‘మంచిర్యాల మెడికల్ కాలేజీ మా హయాంలోనే మంజూరైంది’: కేటీఆర్
X

దిశ, మంచిర్యాల: 2028 నాటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంతో పాటు మంచిర్యాల జిల్లాలో గులాబీ జెండా ఎగరేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం మంచిర్యాలకు వచ్చిన ఆయన నస్పూర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ రావాల్సిందేనని కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణిలో ఎన్నడు లేని విధంగా 16 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్‌ కే దక్కుతుందని చెప్పారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా తాము ఇచ్చిన ఉద్యోగాల పైన ఏసీబీ విచారణ జరిపించాలని శాసనమండలిలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మహిళలను కోటీశ్వర్లు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రికి కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అని ఎద్దేవా చేశారు. సింగరేణిలో మాజీ కార్మికులకు ఇళ్ల పట్టాలు రావాలన్న వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరణ జరగాలన్న ఇక్కడ టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్‌ను గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

మెడికల్ కాలేజీ తమ ఘనతే..

మంచిర్యాల జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేసిన ఘనత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కేటీఆర్ వెల్లడించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా మెడికల్ కాలేజీని సందర్శించారు. సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం చేపడితే దాన్ని కూళేశ్వరం అని ఎద్దేవా చేశారని ఇప్పుడు ఒక్కసారి గతానికి నేటికీ పంటలు దిగుబడి ఎలా ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల ఆదిలాబాద్‌లో పర్యటించిన ముఖ్యమంత్రి తమ్మిహెట్టి ప్రాజెక్టు కడుదామని చెప్పడం బాధాకరం అనిపిస్తోందని, కేవలం 52 కోట్లు కేటాయించి ప్రాజెక్టు కడతామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఓడించారు .. ఏం చేద్దాం..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల మూడు నియోజక వర్గాల్లో బీఆర్ఎస్‌ను ఓడించారని, ఇప్పుడు ప్ల కార్డులు పట్టుకుంటే ఏం ఫలితం ఉంటుందని కేటీఆర్ చెప్పారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలన్నా వారసత్వ ఉద్యోగాలు రావాలన్నా టీఆర్ఎస్ గెలుపు ఒకటే ప్రధానం మార్గమని తెలిపారు. అప్పుడు ఓడించి ఇప్పుడు ప్ల కార్డులు పట్టుకుంటే ఏం ఫలితం ఉంటుందని కూడా సుతిమెత్తగా కార్యకర్తలకు వివరించారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి, మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు సైనికుల్లో పనిచేయాలని కోరారు.

Next Story