- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అధిక లాభాల ఆశచూపి కోట్ల దోపిడీ.. కిలాడీ లేడీ అరెస్ట్
సామాన్యుల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని, అధిక లాభాల పేరుతో కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

దిశ, కాగజ్‌నగర్: సామాన్యుల ఆశలను పెట్టుబడిగా మార్చుకుని, అధిక లాభాల పేరుతో కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మోసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ అంతర్ జిల్లా మోసగాళ్ల ముఠాలో కీలక సభ్యురాలైన థాకూర్ శివరంజని బాయిని కాగజ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నితిక పంత్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. సికింద్రాబాద్‌కు చెందిన థాకూర్ కరణ్ సింగ్ తన కుటుంబ సభ్యులతో కలిసి డివైన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట నకిలీ సంస్థను స్థాపించాడు. 2021 నుంచి 2023 వరకు కాగజ్‌నగర్ పట్టణంలో నివాసం ఉంటూ స్థానికులను బుట్టలో వేసుకున్నారు.
తమ కంపెనీలో పెట్టుబడి పెడితే నెలకు 5% నుంచి 20% వరకు భారీ లాభాలు అందిస్తామని నమ్మబలికారు. వీరి మాటలు నమ్మి కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్ పరిసర ప్రాంతాల ప్రజలు లక్షలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. వసూళ్లు పూర్తయ్యాక నిందితులు రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి పరారయ్యారు. నిందితులపై ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి కేవలం కొమరం భీమ్ జిల్లా లోనే కాగజ్‌నగర్ టౌన్ లో 1.08 కోట్లు, పెంచికల్‌పేట్ రూ. 10 లక్షల రూపాయలు, సికింద్రాబాద్ లాలాగూడలో 31 లక్షలు, CCS పరిధిలో రూ. 1.25 కోట్ల భారీ మోసానికి పాల్పడినట్లు తెలిపారు. తమపై కేసులు నమోదు కావడంతో నిందితులు సికింద్రాబాద్‌లోని తమ నివాసానికి మకాం మార్చారు.
పక్కా సమాచారంతో కాగజ్‌నగర్ పోలీసులు ఏప్రిల్ 24న సికింద్రాబాద్‌లో మెరుపు దాడి చేసి శివరంజని బాయిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు A1 కరణ్ సింగ్, A2 రతన్ సింగ్, A3 రవీందర్, A5 రాణా సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేశామని ఎస్పీ తెలిపారు. నిందితురాలిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కాగజ్‌నగర్ డిఎస్పీ వాహిదుద్దీన్, టౌన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ఎస్సై రాజు, మహిళా కానిస్టేబుళ్లు లక్ష్మి, జోష్ణ, బ్లేస్సి, శమీనా మరియు కానిస్టేబుల్ విజయ్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సంబంధిత బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు.






