- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్టలు నేలమట్టం.. మైనింగ్ మాఫియా హవా
కొమరం భీమ్ జిల్లాలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది.

దిశ, కాగజ్‌నగర్ : కొమరం భీమ్ జిల్లాలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఒకవైపు అక్రమ మైనింగ్‌ను సహించేదిలేదని జిల్లా కలెక్టర్ ప్రకటనలు చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం దీనికి విరుద్ధంగా అధికారులు మట్టి మాఫియాతో చేతులు కలిపి మామూళ్ల మత్తులో తూగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం కాగజ్‌నగర్ చారిగంలో మైనింగ్, మండల సర్వేయర్ అధికారులు నిర్వహించిన తనిఖీలు కేవలం నామమాత్రమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగజ్‌నగర్ మండలంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపించినా, గుట్టలు దర్శనమిచ్చినా అక్కడ వాలిపోవడంలో కొందరు ముందుంటున్నారని, ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలను పాతాళంలోకి తొక్కి, రాజకీయ ప్రోద్బలంతో గత పదేళ్లుగా వేల మెట్రిక్ టన్నుల మట్టిని వెంచర్లు, నాళాలను పూడ్చడానికి తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ అక్రమ మైనింగ్ విషయాన్ని మాలి సంఘం జిల్లా అధ్యక్షుడు లెండుగురే శ్యామ్‌రావు ఆధారాలతో సహా గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. శనివారం తనిఖీలకు వచ్చిన అధికారుల తీరును గమనిస్తే, వారు వస్తారు – వెళ్తారు, ఇది కేవలం నామమాత్రమేనని స్థానికులు అంటున్నారు. అక్రమంగా భారీగా మట్టి తవ్వకాలు చేస్తూ పట్టుబడ్డ సందర్భాల్లో కూడా మైనింగ్ డిపార్ట్‌మెంట్ ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా తూతూ మంత్రంగా వ్యవహరించి, రాజకీయ ఒత్తిళ్లు, ముడుపులకు తలొగ్గి అక్రమార్కులను వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగజ్‌నగర్ మండలంలోని చింతగూడ, బలగాల గ్రామపంచాయతీలకు సంబంధించిన సుమారు పది ఎకరాల స్మశానవాటికలో కూడా మైనింగ్ నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్కడ శవాలు బయటపడినా వాటిని పక్కకు తొలగించి మైనింగ్ కొనసాగించారని చెబుతున్నారు.
ఈ విషయం పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ, ఎమ్మార్వో, మైనింగ్ అధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు తప్ప ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నామమాత్రపు తనిఖీలు కాకుండా అక్రమ మైనింగ్‌ను అరికట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే గుట్టలు నేలమట్టం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అక్రమాల్లో జిల్లాను ముందంజలో నిలుపుతున్న ఈ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే కాగజ్‌నగర్ అక్రమార్కుల అడ్డాగా మారిపోవడం ఖాయమని పేర్కొన్నారు.






