ఉద్యోగాల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాలి

by Nallavelli.Anjaneyulu |

ఏజెన్సీ ప్రాంతాలలో తక్షణమే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాధవ్ సుమేష్ డిమాండ్ చేశారు.

ఉద్యోగాల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాలి
X

దిశ, ఉట్నూర్ : ఏజెన్సీ ప్రాంతాలలో తక్షణమే ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయాలని ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి జాధవ్ సుమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ ట్రైబల్ నిరుద్యోగులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో గత 15 సంవత్సరాలుగా సరైన ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో వేలాది మంది గిరిజన నిరుద్యోగ యువత తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది యువకులు ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటూ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఏజెన్సీ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేయడానికి ప్రత్యేక నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జీవో నెంబర్-30 ప్రకారం.. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 46 సంవత్సరాలకు పెంచి, దీర్ఘకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల గిరిజన యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనుల హక్కులు, ఉద్యోగ అవకాశాల పరిరక్షణకు అత్యంత కీలకమైన జీవో నెంబర్–3ను వెంటనే పునరుద్ధరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలలో గిరిజన నిరుద్యోగులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని, ఐటీడీఏ పరిధిలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించి, ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన అర్హులైన గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. సమావేశంలో ట్రైబల్ నిరుద్యోగులు మాడవి నగేష్, మాధవి తిరుపతి, రాథోడ్ ప్రవీణ్ తదితర గిరిజన నిరుద్యోగులు ఉన్నారు.

Next Story